3 నెలల్లో రెండు ట్రయల్స్ పూర్తి చేస్తాం: జైదుస్

by Shamantha N |
3 నెలల్లో రెండు ట్రయల్స్ పూర్తి చేస్తాం: జైదుస్
X

న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేస్తున్న రెండో కరోనా వ్యాక్సిన్ జైకోవ్-డీ క్లినికల్ ట్రయల్స్ ఈ నెలలో ప్రారంభిస్తామని, తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను మూడు నెలల్లో పూర్తిచేస్తామని జైదుస్ కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఈ నెలలోనే వెయ్యి మంది పేషెంట్లపై నిర్వహిస్తారని వెల్లడించారు. కరోనా ఆపత్కాలాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారని చెప్పారు. మూడో దశ ట్రయల్స్ లేకుండానే వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టే నిర్ణయాలు చేస్తున్నట్టు తెలిసిందన్న సందేహానికి స్పందిస్తూ, రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాక రెగ్యులేటర్‌ను సంప్రదిస్తామని ఆయన అన్నారు. రెగ్యులేటర్ ఏది చెబితే ఆ దారినే అనుసరిస్తామని వివరంచారు. రెండు ట్రయల్స్ పూర్తయ్యేనాటికి తమ దగ్గర వ్యాక్సిన్ సమాచారం సరిపడా ఉంటుందని, మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. అప్పుడే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశముంటుందని అన్నారు. మనదేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్‌కు కేంద్రం క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిచ్చింది. ట్రయల్స్‌కు అనుమతి పొందిన తొలి భారతీయ వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. దీని తర్వాత మళ్లీ జైదుస్ కాడిలా ఫార్మా కంపెనీ తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) నుంచి గురువారం అనుమతి పొందింది.

Advertisement

Next Story

Most Viewed