‘కువైట్‌లో చిక్కుకున్న భర్త తిరిగొస్తాడా’

by  |
‘కువైట్‌లో చిక్కుకున్న భర్త తిరిగొస్తాడా’
X

దిశ, ఏపీ బ్యూరో : ‘‘ అన్నా.. ముగ్గురు పసిబిడ్డలన్నా. చాలా కష్టాలు పడుతున్నామన్నా ! ఏదో ఆయన సంపాయించి తీసుకొస్తే బతుకుతామనుకున్నాం. పాస్​పోర్టు తీసుకున్నారట. వేధింపులు తట్టుకోలేక ఉద్యోగం వదిలేసిపోయినాడు. ఎక్కడున్నాడో.. ఎటుపోయినాడో తెలీదన్నా. మీరే ఎట్టన్నా ఆదుకోవాలన్నా ! ”

అమ్ము దుఖ్ఖాన్ని ఆపుకోలేక ఫోన్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. భర్త కువైట్​వెళ్లి ఎనిమిది నెలలవుతోంది. అక్కడ మన కరెన్సీలో నెలకు 20 వేల వేతనం. పెద్దగా డబ్బులేం పంపింది లేదు. ముందు నాలుగేళ్ల ఓ బుడతడు.. వాడికి తోడు రెండో కాన్పులో కవల పిల్లలు. నిండా పాతికేళ్లు లేని అమ్ముకు ముగ్గురు మగపిల్లలు కలిగారన్న సంతోషం లేదు. వాళ్ల బాగోగులు ఎలాగన్నదే బెంగ. తిరుపతిలో ఉంటున్న అమ్మ దగ్గరే కాలం వెళ్లదీస్తోంది. ఆయన్ని ఇక్కడకు రప్పించడానికి ఏమన్నా చేయండి అంకుల్​అని అడుగుతుంటే గుండె చిక్కబట్టింది.

కువైట్​కు డ్రైవర్ గా పంపిన ఏజెంటు ఏం సమాధానమిచ్చాడో తెలీదు. అమ్ము ఇంటికెళ్లిపోయింది కళ్లొత్తుకుంటూ. కువైట్​లో తెలిసిన మిత్రులకు సమాచారమిచ్చా. వీలైతే సాయం చేయమని రిక్వెస్ట్​ చేశా. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ మంది కువైట్​కే పనులకెళ్తుంటారు. కారణమేంటో తెలీదు.

ఓ సీనియర్​ జర్నలిస్టును అడిగితే “పలమనేరు, మదనపల్లి, పీలేరు, కదిరి, రాజంపేట తదితర ప్రాంతాల్లో భూములన్నీ వర్షాధారమే. కొండగుట్టల మధ్య ఉంటాయి. నీటి నిల్వపై ప్రభుత్వాలు దృష్టిపెట్టలేదు. సాగునీటికి అవకాశం చాలా తక్కువ. పనులు దొరికేది గగనం. అందుకే ఎక్కువగా కువైట్​పోతుంటారని ”చెప్పారు.

ఆయా ప్రాంతాల్లోని ముస్లిములు ఎక్కువగా పనుల కోసం కువైట్​ వెళ్తున్నట్టు చెప్పారు. ఇక్కడ మగవాళ్లు వెళ్లడం వేరు. కానీ వివాహమైన ఆడవాళ్లు సైతం ఇళ్లల్లో పాచిపని కోసం వెళ్తుంటారు. అక్కడ యజమానుల లైంగిక, శారీరక వేధింపులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయింది ఎందరో. లెక్కాపద్దూ లేదు. ఉద్యోగం కోసం అధికారికంగా పాస్​పోర్టు తీసుకొని వెళ్తే కొంత రక్షణకు అవకాశముంటుంది. కానీ అనధికారికంగా వెళ్లే వాళ్లే ఎక్కువ. ట్రావెల్​ ఏజెన్సీలు, దళారుల ద్వారా కువైట్​కు పంపేది రెండింతలు ఎక్కువని తెలిసింది. అందులోనూ దగ్గర రక్తసంబంధీకులే దళారుల అవతారమెత్తి విదేశాలకు పంపుతుంటారు. అన్ని స్థాయిల్లోనూ కమీషన్లుంటాయి. అసలు దీనికి ఎక్కడో ఒకచోట చెక్​పెట్టాలని తిరుపతి పాస్​పోర్టు కార్యాలయానికి వెళ్తే..

కోవిడ్​ నిబంధనలు బాగా పాటిస్తున్నారు. ఆరోగ్య సేతు యాప్​చూపిస్తేనే లోపలకు అనుమతిస్తున్నారు. ఏటా కువైట్ కు రాయలసీమ జిల్లాల నుంచి లేదా చిత్తూరు జిల్లా నుంచి ఎంతమంది కువైట్​ వెళ్లడానికి పాస్​పోర్టు తీసుకుంటున్నారనే సమాచారం అడిగా… అనధికారికంగా వెళ్తే వాళ్లను తీసుకొచ్చే అవకాశముందా అని అడిగేలోపు.. ఆ అధికారి వినిపించుకోకుండా లోపలకు వెళ్లిపోయాడు. ఓ అరగంట కార్యాలయం బయటే నిలిపారు.

తర్వాత ఏ పేపరన్నారు. నిఘా కోసం వచ్చారా.. కేవలం సమాచారం కోసమే వచ్చారా అని రెండు సార్లు అడిగారు. సమాచారమిస్తే వెళ్లిపోతానన్నా. మరోపావుగంట తర్వాత బయటకొచ్చి మేం ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు. విశాఖపట్నం కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పారు. కనీసం మీ ఆన్​లైన్​లో పెట్టిన సమాచారమైనా ఇవ్వమని అడిగా. తమ చేతులు తప్ప నోరు పెగలదని చెప్పకనే చెప్పారు.

మళ్లీ అమ్ము దగ్గరకొచ్చి సమాచారం ఏమైనా తెలిసిందా అనడిగా. ఓ పదిరోజులపాటు అక్కడా ఇక్కడా గడిపి మరోచోట కొలువుకు కుదిరాడని చెప్పింది. కాకుంటే పాస్​పోర్టు గట్రా అన్నీ పాత యజమాని దగ్గర ఉండిపోయాయి. ఏం జరుగుతదో తెలవదంకుల్. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. అందాక ఎలాగో కాలం నెట్టుకుపోతామంటూ చెప్పింది. అమ్ము వెనకాలనున్న వాళ్లమ్మ గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న కన్నీళ్లొత్తుకుంటూ అక్కడ నుంచి భారంగా కదిలారు. రాయలసీమ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు దళారుల మాఫియా విస్తరించింది. అది పేద కుటుంబాల్లోకి చాలా ఎక్కువగా చొరబడింది. దీనికి విరుగుడెప్పుడో.. అమ్ములాంటి తల్లుల మొహంలో వెలుగులు నిండేదెన్నడో కాలమే నిర్ణయించాలి.



Next Story

Most Viewed