దుర్మార్గాలకు సహకరించిన ఎస్ఈసీపై ఎందుకంత కక్ష?: కన్నా

by  |
దుర్మార్గాలకు సహకరించిన ఎస్ఈసీపై ఎందుకంత కక్ష?: కన్నా
X

ఆంధ్రప్రదేశ్‌లో నియంతృత్వ పాలన నడుస్తోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీని ఇంటికి పంపడంపై ఆయన మాట్లాడుతూ, ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారన్న ఆగ్రహంతో ఏకంగా శాసన మండలినే రద్దు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీపై కక్ష సాధించారని కన్నా మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అనేక దౌర్జన్యాలకు, అక్రమాలకు ఎన్నికల కమిషన్ స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. అన్యాయంగా ఏకగ్రీవాలైన సందర్భంలో కూడా ఎస్ఈసీ నోరు మెదపలేదని అన్నారు. ఇన్ని దుర్మార్గాలకు సహకరించిన ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ ఇంతలా ఎందుకు కక్షబూనాడో అర్థం కావడంలేదని ఆయన విమర్శించారు.

“ఎలక్షన్ కమిషనర్ ను విమర్శించాల్సింది మేము. బీజేపీ అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది. ఒకరకంగా ఎన్నికల సంఘం ఈ ప్రభుత్వానికి ఎంతో మేలు చేసింది. వైసీపీ అభ్యర్థుల దుర్మార్గాలపై ఎన్నో ఫిర్యాదులు చేసినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారంటూ మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. అలాంటి ఎన్నికల కమిషనర్ పై ఇలాంటి చర్య ఉంటుందని ఊహించలేకపోయాం” అని అన్నారు.

ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీని తొలగించడం సీఎం అహంకారానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇంతటి దుర్గతి ఎప్పుడూ పట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టమని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి చూస్తుంటే తాను తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేస్తూ, మొట్టికాయలు వేస్తున్న రాష్ట్ర హైకోర్టును కూడా రద్దు చేస్తారేమోనని అనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

తనకు 151 సీట్లు ఇచ్చారు కాబట్టి తాను తలచిందే రాష్ట్రంలో జరగాలని జగన్ అనుకుంటున్నాడని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు కేసులు పెడుతున్నారని కన్నా విమర్శించారు. 15 రోజుల లాక్‌డౌన్ కే జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని తీసుకువచ్చాడని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రిని రాష్ట్రానికి పట్టిన చీడగా ఆయన అభివర్ణించారు. దీనిపై తాను గవర్నర్ కు లేఖ రాస్తున్నానని ఆయన తెలిపారు.

Tags: kanna laxminarayana,ap bjp chief, ysrcp,ap, sec, nimmagadda ramesh kumar

Advertisement

Next Story

Most Viewed