టీఆర్ఎస్ మౌనం వెనక రహస్యం.. భయమా? రాజకీయ ఒత్తిడా?

by Anukaran |
టీఆర్ఎస్ మౌనం వెనక రహస్యం.. భయమా? రాజకీయ ఒత్తిడా?
X
బడ్జెట్ కేంద్రానిదైనా, రాష్ట్రానిదైనా చట్టసభలలో సమర్పించిన తర్వాత అధికార, విపక్ష పార్టీలు స్పందించడం, అభిప్రాయాలను వెల్లడించడం సాధారణం. కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటుకు సమర్పించిన తర్వాత తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. బడ్జెట్‌ను సమర్ధిస్తోందా లేక వ్యతిరేకిస్తోందా అనేదీ ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలు మౌనంగానే ఉండిపోయారు. దీనికి కారణం భయమా? లేక రాజకీయ ఒత్తిడా? అనే చర్చలు అంతటా మొదలయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ అధిష్టానం నుంచి ఉన్న ఆదేశాల మేరకే బడ్జెట్ మీద మౌనంగా ఉండాల్సి వస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో, ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కక్కలేని, మింగలేని విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. గతేడాది బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గంటల వ్యవధిలోనే ప్రగతిభవన్‌లో సలహాదారులు, ఆర్థిక నిపుణులు, ఆ శాఖ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి తదితరులతో సమావేశమై సమీక్షించారు. ‘ఇది దగా.. మోసం.. ధోకా.. తెలంగాణకు అన్యాయం…కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే’ ఇలా అనేక రకాలుగా కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈసారి మాత్రం అలాంటి సమావేశం జరగలేదు. గతేడాది కనిపించిన దూకుడు ఈ సంవత్సరం లేదు. బడ్జెట్ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోనే లేరు. అధికారులతో సమావేశం కూడా జరగలేదు. ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రమే బడ్జెట్ ప్రభావం తెలంగాణపై ఏ విధంగా ఉంటుందో క్లుప్తంగా చర్చించుకున్నారు.

ఢిల్లీ పర్యటనే కారణమా?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వ్యవసాయ చట్టాలను తూర్పారబట్టిన టీఆర్ఎస్ ఢిల్లీ పర్యటన తర్వాత సైలెంట్ అయిపోయింది. కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి సాహసించడం లేదు. ఇప్పుడు బడ్జెట్ విషయంలోనూ కేంద్రానికి ఆగ్రహం కలిగించవద్దన్న వైఖరినే తీసుకుంది. ఏ ఒత్తిడి కారణంగా టీఆర్ఎస్ సైలెంట్ అయిందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత బండి సంజయ్ పలు సందర్భాలలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రహస్యాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు మినహా ఢిల్లీలో ఏం జరిగిందో ఆ పార్టీ నేతలకే తెలియదు. బడ్జెట్‌ ఎలా ఉన్నా టీఆర్ఎస్ వైఖరిని వెల్లడించాల్సిన అవసరం లేదన్నది పార్టీ తీసుకున్న విధాన నిర్ణయమేనని, అందుకే మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఓ ఎంపీ ఢిల్లీ పాత్రికేయులతో వ్యాఖ్యానించారు.

కేంద్ర బడ్జెట్ గురించి అన్ని పార్టీలూ వాటివాటి అభిప్రాయాలను వెల్లడించడానికి లేని ఇబ్బంది టీఆర్ఎస్‌కు మాత్రమే ఎందుకు వచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రానికి ఆగ్రహం కలిగిస్తే టీఆర్ఎస్‌కు వచ్చే ప్రమాదమేంటనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటుచేస్తానని, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తేవడానికి హైదరాబాద్‌లోనే కాంక్లేవ్ ఏర్పాటుచేస్తానని చెప్పిన కేసీఆర్ ఒక్కసారిగా ఎందుకు డౌన్ అయిపోయారని, సైలెంట్‌గా ఉండడమే ఉత్తమం అనే మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం మౌనాన్నే పాటిస్తున్నారు.

భయమా? రాజకీయ వ్యూహమా

కేంద్రానికి ఆగ్రహం కలిగించడం ద్వారా పార్టీకి ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ మౌనంగా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుందని, ఇది ఒక రాజకీయ వ్యూహమేననే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలతో సమావేశం నిర్వహించి ఉభయ సభలలో అనుసరించాల్సిన వైఖరి, రాష్ట్ర డిమాండ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాన్ని నొక్కిచెప్పారు. గత ఏడాది వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ సమావేశం నిర్వహించారు.

ఈసారి మాత్రం వ్యవసాయ చట్టాల వివాదం, బడ్జెట్ కేటాయింపులలాంటి కీలక అంశాలు ఉన్నా కేసీఆర్ అలాంటి సమావేశాన్ని నిర్వహించకపోవడంతో సందేహాలకు తెర లేపినట్లయింది. ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రానికి చేయాల్సిన కేటాయింపులపైనా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపైనా, జీఎస్టీ నష్టపరిహారం విడుదలపైనా, రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలకు ఇచ్చే ఆర్థిక సాయంపైనా, సెస్‌ల రూపంలో కేంద్రం పన్నులు విధించడం ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపైనా, ఆర్థిక సంఘం సిఫారసులతో తెలంగాణ కోల్పోనున్న ఆదాయంపైనా.. ఇలా అనేక అంశాలలో కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, రీజినల్ రింగు రోడ్డు, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయానికి సెంట్రల్ వర్సిటీ హోదాలాంటి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లేవీ తాజా బడ్జెట్‌లో హామీలకు నోచుకోలేదు.

తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని గతేడాది బడ్జెట్ సందర్భంగా ఇందులోని కొన్ని అంశాలను ఏకరువు పెట్టినా ఈసారి కూడా రాలేదు. టీఆర్ఎస్ మాత్రం కేంద్రంపై అసంతృప్తినిగానీ, ఆగ్రహాన్నిగానీ వ్యక్తం చేయకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటించింది. నొప్పించక తానొవ్వక అనే విధానమే భేషైనదిగా భావించినట్లుంది. భయమా లేక కేంద్రం నుంచి ఒత్తిడా అనేదానికి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సింది టీఆర్ఎస్ మాత్రమే.

Advertisement

Next Story