ఆకలి భారతం.. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినా ఆకలి పోరాటమే

by Anukaran |
ఆకలి భారతం.. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినా ఆకలి పోరాటమే
X

దిశ, ఫీచర్స్ : అభివృద్ధి అంటే అద్దంలా మెరిసే రోడ్లు, ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలు కాదు. ఆకలి ఎరుగని సమాజం, పస్తులుండని ప్రజలు. కానీ ఈ భూమ్మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాళీ కడుపుతోనే నిద్రపోతుండటం కలవరపెట్టే అంశం. కొవిడ్ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా.. పేదరికం, ఆకలి విషయాల్లో భారత్‌‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే గతవారం విడుదలైన గ్లోబల్ ఇండెక్స్‌లో గతేడాదితో పోలిస్తే ఇండియా ఏడు స్థానాలు కోల్పోయి 101వ ర్యాంకుకు చేరుకోవడం వాస్తవ స్థితికి అద్దం పడుతోంది. ఇక్కడ 100 పాయింట్స్ స్కేల్‌లో ‘0’ ఆకలి లేని స్థితిని సూచిస్తే ‘100’ అత్యంత ఆందోళనకరమైన’ పరిస్థితిని ఇండికేట్ చేస్తుంది. కాగా 27.5 స్కోరు భారత్‌లో ఆకలి స్థాయి తీవ్రతను చూపిస్తోంది. ఇదిలా ఉంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినట్లు గణాంకాలు చెబుతుండగా.. మరి వాస్తవ పరిస్థితులకు గల వ్యత్యాసానికి కారణమేంటి?

గ్లోబల్ స్కోర్ లెక్కించేందుకు ఇండెక్స్.. ప్రధానంగా ‘పోషకాహార లోపం, చిక్కిపోయిన పిల్లలు (ఎత్తుకు తగ్గ బరువులేని ఐదేళ్లలోపు పిల్లలు), ఎదుగుదల లేని పిల్లలు (వయసుకు తగ్గ ఎత్తులేని ఐదేళ్లలోపు పిల్లలు), పిల్లల మరణాలు (ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు)’ వంటి నాలుగు పారామీటర్స్‌ను ఉపయోగిస్తుంది. దీని ప్రకారం కొన్నేళ్లుగా భారత్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో కింది చార్ట్‌లో చూడొచ్చు.

తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్న ఐదేళ్లలోపు పిల్లల సంఖ్యలో మొత్తం 116 దేశాల్లో భారతదేశం టాప్ ర్యాంక్‌లో ఉంది. 2010-2014లో చిక్కిపోయిన పిల్లల సంఖ్య 15.1% ఉండగా.. 2016- 2020 వరకు 17.3 శాతానికి పెరగనుందని నివేదిక అంచనా వేసింది. పిల్లల్లో ఎదుగుదల లేమి 34.7%తో అత్యధికంగా వర్గీకరించబడగా భారత్‌లో పిల్లల మరణాల రేటు మాత్రం 2012లో 5.2% నుంచి 2021 నాటికి 3.4%కి తగ్గింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలైన పాకిస్థాన్ (92), బంగ్లాదేశ్ (76), నేపాల్ (76) కంటే కూడా ఇండియా వెనుకబడి ఉండటం గమనార్హం.

దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

పెరుగుతున్న ఆహార అభద్రత భారతదేశంలోని పిల్లల ఆరోగ్య ఫలితాలపై హానికరమైన దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రకారం పోషకాహార లోపం తరతరాలపై ప్రభావం చూపుతుంది. దీంతో తల్లులు బరువు తగ్గడం లేదా బరువు తక్కువగా ఉన్న పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు పుట్టిన మొదటి 1,000 రోజుల్లో తీసుకునే పోషకాహారమే పిల్లల ఆరోగ్యానికి కీలకమైంది. ఎందుకంటే వారి మొత్తం జీవితకాలాన్ని ఈ పీరియడే నిర్ణయిస్తుంది.

గత 20 ఏళ్లలో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 198 మిలియన్ టన్నుల నుంచి 269 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది అందరికీ ఆహారం లభిస్తుందనే విషయాన్ని నిర్దారిస్తుండగా.. దేశంలోని మూడింట రెండొంతుల మందికి సబ్సిడీ రేట్లపై ఆహారం, పోషకాహార భద్రతను అందించడమే జాతీయ భద్రతా చట్టం- 2013 లక్ష్యం. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 75% గ్రామీణ జనాభా, 50% పట్టణ జనాభాను కవర్ చేస్తుంది.

భారత్ ఎందుకు ఆకలితో పోరాడుతోంది?

ఆహార ఉత్పత్తి కొరత, ఆహార పంపిణీ వ్యవస్థల్లో అంతరాయం మధ్య ఒక విధమైన సంబంధం ఉంటుంది. ఆకలికి కేవలం ఆహార లభ్యతలో క్షీణతే కాక అనేక ఇతర వేరియబుల్స్ కారణమని అమర్త్యసేన్ ‘పావర్టీ అండ్ ఫెమిన్స్’ బుక్‌లో వివరించాడు. భారతదేశంలో ఆకలి సంక్షోభాన్ని వివరించడానికి ఈ సిద్ధాంతాన్ని అన్వయించవచ్చు. అందుబాటులో ఉన్న వస్తువులు, సేవలను పొందేందుకు ప్రతీ వ్యక్తికి అర్హత ఉందని సేన్ వాదించాడు. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు, కొత్త రేషన్ చట్టాల అమలు లేదా పంపిణీ వ్యవస్థల్లో మార్పులు వంటి అనేక కారణాల వల్ల ఈ అర్హత మారవచ్చు. ప్రభుత్వ విధానాల అమలు కూడా అలాంటి అర్హత వైఫల్యాలకు కారణమవుతుందని తెలుస్తోంది.

ఒకటి.. గత సంవత్సరంలో రోజుకు $ 2 కంటే తక్కువ ఆదాయం ఉన్న పేదల సంఖ్య రెట్టింపు అయింది. మహమ్మారి ప్రేరిత మాంద్యం కారణంగా ఈ సంఖ్య 75 మిలియన్లకు పెరిగిందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. సహజంగానే పేదలు ఖరీదైన ఆహారాన్ని తీసుకోవడం మానేశారు. ఇది భారతదేశంలో పోషకాహారలోప సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఆహారం సమృద్ధిగా ఉన్నంత మాత్రాన ఆకలిని నిర్మూలించలేమని, ప్రజలకు కొనుగోలు శక్తి ఉంటేనే సాధ్యమనేది స్పష్టం అవుతోంది.

రెండు.. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌(ఇది ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారాన్ని అందించే సంస్థ)కు కేటాయించిన మొత్తం నిధులలో 44% మాత్రమే 2018- 19లో ఉపయోగించబడ్డాయని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్ వెల్లడించింది. ఇక అదే అకడమిక్ ఇయర్‌లో పిల్లల మధ్యాహ్న భోజన పథకం కోసం కేటాయించిన మొత్తం నిధులను భారతదేశంలోని 14 రాష్ట్రాలు మాత్రమే పూర్తిగా ఉపయోగించుకున్నాయి. ఆర్థికవేత్త జీన్ డ్రోజ్ కనుగొన్న అంశాల ఆధారంగా ఈ సమస్య మరో మలుపు తిరిగింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆయన.. 2014-2021 మధ్య మిడ్ డే భోజన పథకం కేటాయింపు 32.3% తగ్గినట్లు అంచనా వేశారు.

ప్రజా పంపిణీ వ్యవస్థలో లేని 40 కోట్ల జనాభా..

2020లో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది మిలియన్ పీపుల్స్‌ జీవిత మార్గంగా నిరూపించబడింది. అయితే దాని నేషనల్ కవరేజీకి సంబంధించి ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, మొత్తం జనాభాలో 67% ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చబడాలి. దీన్ని మన జనాభాకు వర్తింపజేసినప్పుడు కనీసం 90 కోట్ల మందిని కవర్ చేయాలి. కానీ వాస్తవానికి 80 కోట్ల మంది మాత్రమే చేర్చబడ్డారు. ఇది భారతదేశంలోని మొత్తం జనాభాలో కేవలం 59% మాత్రమే. అంటే 5.1 కోట్ల మంది ప్రజలు పరిమిత కవరేజీని పొందుతున్నారని, 40 కోట్ల మంది ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి పూర్తిగా బయటపడ్డారని డేటా సూచిస్తోంది.

భారతదేశంలో ఇటువంటి హక్కుల వైఫల్యాల కారణంగా.. ఆహార అభద్రత ఆందోళనకరమైన సమస్యగా మిగిలిపోయింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కనుగొన్న విషయాలను ప్రభుత్వం ‘అశాస్త్రీయమైనవి’ గా తిరస్కరించినప్పటికీ గ్రౌండ్ రియాలిటీని విస్మరించలేమని అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed