కలలు గుర్తుంటాయా?

దిశ, వెబ్‌డెస్క్ :
కలలు అందరికీ వస్తుంటాయా? అసలు కలలు అంటే ఏమిటి? సాధారణంగా రోజుకు ఎన్ని కలలు రావచ్చు? కలల్ని మనం నియంత్రించగలుగుతామా? కలలకు అర్థం ఏదైనా ఉంటుందా?

సాధారణంగా చాలా సినిమాల్లో.. హీరో, హీరోయిన్లు ‌డ్రీమ్స్‌ లోకి వెళ్లిపోతారు. అందాల బుట్టబొమ్మతో.. హీరో పాటేసుకుంటాడు. డ్యాన్స్‌ చేస్తాడు. అందమైన లొకేషన్‌లో విహరిస్తుంటాడు. ఆకాశ వీధుల్లో.. మేఘాల పల్లకిలో ఊరేగుతుంటారు. కానీ ఇది రీల్‌ లైఫ్‌. అదే మన రియల్‌ లైఫ్‌లో.. కలలు నిద్రించిన సమయంలో మాత్రమే వస్తుంటాయి. మనిషి ఆలోచనలకు, ఆందోళనలకు, ఊహలకు, భయాలకు రకరకాల భావోద్వేగాలకు ఓ రూపమే కల.

ప్రతి మనిషికి కలలు రావడం సహజమే. నిద్రించిన సమయంలో రోజుకి సగటున మూడు నుంచి ఆరు కలలు వస్తాయి. అంతకంటే ఎక్కువ కలలు కూడా రావొచ్చు. ఒక్కో కల ఐదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఉంటుంది. మనం నిద్రించే సమయంలో సుమారు రెండు గంటల పాటు కలలు వచ్చే అవకాశం ఉంటుందనేది పరిశోధకుల మాట. నిజానికి మనం నిద్ర లేచాక దాదాపు 95 శాతం కలలు గుర్తుండవు. కలలన్నీ కూడా రంగుల్లోనే వస్తాయనే రూలేం లేదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కూడా కలలు వస్తుంటాయట. పురుషులు, స్త్రీలు వేర్వేరుగా కలలు కంటారు. పురుషులు ఎక్కువగా వెపన్స్‌‌కు సంబంధించిన కలలు కంటే, స్త్రీలు బట్టలకు సంబంధించిన కలల్లో విహరిస్తారట.

అయితే సాధారణ సమయం కంటే గర్భధారణ సమయంలో స్త్రీలకు మరీ ఎక్కువగా కలలు వస్తుంటాయి. ఇందుకు కారణం పుట్టబోయే పిల్లల జీవితం కోసం ఎక్కువగా ఆలోచించడటమే అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. తమకు పుట్టబోయే బిడ్డ.. ఆడా, మగా ? అని ఆలోచించడం కూడా అందుకు ఓ కారణమని తెలుస్తోంది. కొన్నిసార్లు మంచి జరిగినట్లు కలొస్తే, మరికొన్ని సార్లు భయపెట్టే కలలు, మనసును ఆందోళనపెట్టే కలలు వస్తుంటాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం నెగెటివ్‌ కలలే ఎక్కువగా వస్తాయని తేలింది. కలల్లో వచ్చే వ్యక్తుల్లో దాదాపు 48 శాతం మంది మనకు పరిచయం ఉన్నవాళ్లే ఉంటారట. 35 శాతం మంది మన బంధువులు, స్నేహితులు లేదా సమాజంలో వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు.. అంటే పోలీసులు, డాక్టర్లు, సినిమా హీరోలు వంటి వాళ్లన్నమాట. ఇక 16 శాతం మంది అసలే తెలియని వ్యక్తులు ఉంటారట.

మన జీవిత కాలంలో సరాసరిన ఆరు సంవత్సరాలు కలలు కనడానికే కేటాయిస్తాం. అయితే కలల్ని మనం నియంత్రించలేమని పరిశోధకులు అంటున్నారు. ఒకరు మనల్ని వెంబడించడం, ఎత్తు మీద నుంచి కిందకు పడిపోవడం, తెలిసిన వ్యక్తి చనిపోవడం, డబ్బు దొరకడం, పాములు, దేవకన్య కనిపించడం, మనం చనిపోయినట్లు ఊహించుకోవడం, అతీంద్రియ శక్తులు మనకు రావడం, ఒక భయంకరమైన ‌ప్రదేశంలో ఇరుక్కుపోవడం , ఎక్కడికైనా లేటుగా వెళ్లడం, సెక్సువల్‌ ఎక్స్‌‌పీరియ‌న్స్‌, పరీక్షలో తప్పడం, స్కూలు, టీచర్లు కనిపించడం, బాల్యంలోకి వెళ్లిపోవడం, ‌ప్రపంచవ్యాప్తంగా ఇలాంటే కలలే ఎక్కువగా వస్తుంటాయని పరిశోధనల్లో తేలింది.

మనుషుల వలె జంతువులు కూడా కలలు కంటాయని పరిశోధకులు తేల్చారు. అంధులు కూడా కలల్లో విహరిస్తారని, చూపు ఉన్నవాళ్లకంటే మెరుగ్గానే వాళ్లు కలలు కంటారని, వారికి కూడా రంగుల్లోనే కలలు వస్తాయని పరిశోధనలో తేలింది. ఎంతోమంది శాస్త్రవేత్తలు కలలపై పరిశోధనలు చేశారు. మానసిక, శారీరక కారణాల వల్ల కలలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నా.. నిర్ధిష్టమైన కారణాలు గుర్తించలేకపోయారు. సో.. కలలు వస్తుంటాయి.. పోతుంటాయి. అందుకే కలల గురించి ఆందోళన చెందడం మానేసి.. హ్యాపీగా కలలు కనండి.

Advertisement