- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మనం వెరీ పూర్.. ముందు నుంచీ అంతేనంట!
సరైన కార్యాచరణ లేకపోవడంతో కృష్టా నీటిని మనం సరిగా వినియోగించుకోలేకపోతున్నామనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మన వాటా కూడా పూర్తిగా వాడుకోవడం లేదు. నీటి నిల్వ వనరులు సంతృప్తికరంగా లేని కారణంగా ఏటా వరద మీదనే ఆధారపడాల్సి వస్తోంది. వానాకాలాన్ని మినహాయిస్తే, యాసంగిలో నదీ పరీవాహక గ్రామాల రైతులు నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితే ఎదురవుతోంది. అటు ఏపీ మాత్రం తన వాటాను పూర్తిగా ఉపయోగించుకోవడమే కాకుండా, అదనపు నీటినీ తరలించుకుపోతోంది.
దిశ, న్యూస్ బ్యూరో: కృష్టా నదిలో మనకు కేటాయించిన నీటిని కూడా పూర్తిగా వినియోగించుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. ఏటా మన వాటా నీరు మిగులుతూనే ఉంది. నీటి వినియోగానికి అవసరమైన ప్రాజెక్టులు, కాల్వలు లేకపోవడమే ఇందుకు కారణం. వరద వచ్చినప్పుడే కృష్ణా నీటిని వినియోగించుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసినా కొంత మేరకైనా నీటిని వినియోగించుకునే అవకాశాలుండేవి. డిండి, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా వెనకాడుతూనే ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి అల్మట్టికి వరద ప్రవాహం మొదలైంది. మంగళవారంనాటికి ప్రాజెక్టులో 58.95 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు నిల్వ 21.96 టీఎంసీలు మాత్రమే. ఇదే సమయానికి మూడు వేల క్యూసెక్కులతో వరద ప్రారంభమైంది. ఇప్పుడు ప్రాజెక్టులో ఎక్కువ నీరు నిల్వ ఉండటమే కాకుండా వరద కూడా ఎక్కువగా ఉంది. దిగువ ప్రాజెక్టుల్లో కూడా నిల్వలు ఎక్కువగానే ఉన్నాయి. నారాయణపూర్ రిజర్వాయరులో ప్రస్తుతం 23.61 టీఎంసీల నీరుంది. గతేడాది 18 టీఎంసీలు ఉన్నాయి. బీమా నదిపైన ఉన్న ఉజ్జయినికి కూడా 2717 క్యూసెక్కులతో వరద వస్తోంది. 117 టీఎంసీల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు నిండితే కృష్ణాలోకి వరద రానుంది. గత ఏడాది 32 టీఎంసీల నీరు నిల్వ ఉంటే, ప్రస్తుతం 54 టీఎంసీలు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టులో కూడా గత ఏడాది రెండు టీఎంసీల నీరుంది. ఇపుడు 4.70 టీఎంసీలు ఉన్నాయి. తుంగభద్రకు కూడా వరద కొనసాగుతోంది. మంగళవారం 6781 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ముందస్తుగా వరద వస్తుండటంతో దిగువన కొంత సంతోషం నెలకొంది.
వినియోగంలో ఏపీ టాప్
ఏపీ ప్రభుత్వం అదనంగా లెక్కలు చూపకుండా కృష్ణా జలాలను తరలించుకుపోతూనే ఉంది. మే 31 వరకు నీటి ఏడాది ముగిసిన నేపథ్యంలో, బోర్డు నీటి వినియోగం లెక్కలను కేంద్రానికి నివేదించింది. దీని ద్వారానే తెలంగాణ తన నీటి వాటా పూర్తిగా వినియోగించుకోవడం లేదని స్పష్టమైంది. ప్రస్తుత నీటి సంవత్సరం (2019-20)లో గత నెల 20 వరకు రెండు తెలుగు రాష్ట్రాలు 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ 647.559 టీఎంసీలు వినియోగించుకుంటే, తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. ఆంధ్రప్రదేశ్ వాటా వినియోగం పూర్తి కావడమే కాకుండా, తాగునీటి కోసం అదనంగా నీళ్లు తీసుకుంది. తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది. ఉమ్మడి ప్రాజెక్ట్ లు, మధ్యతరహా ప్రాజెక్ట్ లో కనీస నీటి మట్టానికి ఎగువన 60.333 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి రాసిన లేఖలో ఈ వివరాలను పొందుపరిచింది.
ఇవీ లెక్కలు
నీటి సంవత్సరం జూన్ 1న ప్రారంభమై మే 31న ముగుస్తుంది. ముగిసిన నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి 1,782 టీఎంసీల ప్రవాహం వచ్చింది. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ లు నిండాయి. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీలో మిగులుగా ఉన్న 801 టీఎంసీలను సముద్రంలోకి పంపించారు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీ–నీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333తో కలుపుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 లు కలుపుకుని మొత్తం 51.344 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంది. సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాలువ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్‌కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఏపీ వినియోగించుకుంది.
మనం వెరీ పూర్
సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 57.799, ఎడమ కాలువ ద్వారా 91.007తో మొత్తం 148.806 టీఎంసీలను మన రాష్ట్రం ఉపయోగించుకుంది. తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి హెచ్చెల్సీ ద్వారా 30.192, ఎల్లెల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది. ఆర్డీఎస్ ద్వారా తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి 27.589, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 12.223, భీమా ఎత్తిపోతల ద్వారా 13.049, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా 4.422 వెరసి 57.283 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్యతరహా ప్రాజెక్ట్‌ల ద్వారా 9.483 టీఎంసీలను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరీవాహక ప్రాంత రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల లభ్యత ఉన్నట్లు బోర్డు లెక్కగట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా (66 శాతం) 647.287 టీఎంసీలు కాగా.. తెలంగాణ వాటా (34 శాతం) 333.451 టీఎంసీలు. కృష్ణా జలాల్లో ఏపీ ప్రభుత్వం మొత్తంగా 647.287 టీఎంసీలతో పాటుగా తాగునీటి అవసరాలకు మరో రెండు టీఎంసీలను తరలించుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 333.451 టీఎంసీలను వినియోగించుకున్నట్లు లెక్కల్లో తేల్చారు. గత నెల 20 నాటికే కృష్ణా జలాల్లో ఏపీ 0.272 టీఎంసీలను ఎక్కువగా వాడుకోగా… తెలంగాణ వాటా మాత్రం 60.605 టీఎంసీలు మిగిలి ఉంది. మనకు వచ్చే వాటాను పూర్తిస్థాయిలో వాడుకోవడంలో కూడా వెనకబడ్డాం.
ముందు నుంచీ అంతే
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వాదనలతో ఆంధ్ర, రాయలసీమ ప్రయోజనాలే పరమావధిగా ఉమ్మడి ఏపీ పాలకులు పని చేశారనేది జగమెరిగిన సత్యం. స్వరాష్ట్రంలోనూ అదే దుర్నీతి కొనసాగుతున్నది. మొదట ఏదో విధంగా ప్రాజెక్టులను కట్టి, ఆ తరువాత వాటి వినియోగాలను ఇప్పటికే వాడుకలో ఉన్న, స్థిరపడ్డ వినియోగాలుగా హక్కులు అడగడం ఏపీ వ్యూహం. కృష్ణా బేసిన్‌లోనే ఉన్న తెలంగాణ ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టులను కుదించి వేసి, కుట్రపూరితంగానే మొదలే పెట్టక, మొదలుపెట్టినా ఏదో ఒక సాకుతో సాగదీస్తూ, నాన్చుతూ పూర్తి చేయకపోవడం కొత్తేమీ కాదు. ఎప్పటికీ ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టు వినియోగంలోకి రాకుండా చేయడం తెలంగాణ ప్రాజెక్టుల పట్ల సాగే కుట్రగా అందరూ గుర్తిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బేసిన్‌లోని వ్యవసాయానికి యోగ్యమైన నేలల్లో కనీసం ఒక పంటకు సాగునీరు లేక రైతాంగం అలమటిస్తుంటే బేసిన్ ఆవల వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న భూములకు నీళ్లు తీసుకుపోవడం ఏపీ చేస్తున్న కుట్రగా భావిస్తున్నారు. ఫ్లోరైడ్, కరువు, వలసలు ప్రధాన ఏజెండాగా సాగిన ఉద్యమం తర్వాత స్వరాష్ట్రంలో కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను అక్రమంగా తోడుకుపోవాలన్న దూకుడుకు కళ్లెం వేస్తూనే, మరోవైపు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ పెండింగు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.