- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ వస్తున్నాడు.. రెండో టెస్టులో బలి అయ్యే బ్యాటర్ ఎవరు..?
దిశ, స్పోర్ట్స్: కాన్పూర్ వేదికగా న్యూజీలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రసవత్తరంగా సాగి చివరకు డ్రాగా ముగిసింది. ఇక డిసెంబర్ 3 నుంచి ముంబై వాంఖడే స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానున్నది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగతున్న ఈ టెస్టుల్లో భారత జట్టు గెలవడం చాలా కీలకం. స్వదేశంలో ఇండియా గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో మ్యాచ్ డ్రా చేసుకోవడం వల్ల కేవలం 4 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. మ్యాచ్ గెలిస్తే ఏకంగా 12 పాయింట్లు ఖాతాలో వేసుకోవచ్చు. ఇప్పటికే టీమ్ ఇండియాకు వచ్చిన 30 పాయింట్లలో రెండు పెనాల్టీ కింద కట్ అయ్యాయి.
అంతే కాకుండా రెండు డ్రాలు చేసుకోవడం వల్ల విజయాల శాతం కూడా తగ్గిపోయింది. దీంతో భారత జట్టు రెండో టెస్టు తప్పని సరిగా గెలవాలనే పట్టుదలతో ఉన్నది. తొలి టెస్టులో సీనియర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. అరంగేట్రం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అయ్యర్, గిల్, సాహ, అశ్విన్ సరైన సమయంలో రాణించడంతోనే భారత జట్టు మంచి లక్ష్యాన్ని సెట్ చేసింది. లేకపోతే మూడో రోజుకే భారత జట్టు చాప చుట్టేసి ఉండేది. ఇక రెండో టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తున్నాడు. దీంతో తొలి టెస్టు తుది జట్టులో నుంచి ఏ బ్యాటర్‌పై వేటుపడుతుందో అర్ధం కావడం లేదు.
ముందు వరుసలో మయాంక్
రెండో టెస్టులో భారత జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో కెప్టెన్ కోహ్లీ ఆడబోతున్న తొలి టెస్టు ఇదే. దీంతో తుది జట్టుపై పూర్తి స్థాయిలో కసరత్తు జరుగబోతున్నది. శ్రేయస్ అయ్యర్ తొలి టెస్టులోనే పూర్తిగా నిరూపించుకున్నాడు. సీనియర్లు విఫలమైన చోటు అయ్యర్ ఒక్కడే క్రీజులో పాతుకొని పోయి భారత జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. మరోవైపు రెండో టెస్టు అయ్యర్ సొంత గడ్డ ముంబైలో జరుగబోతున్నది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించే సాహసం చేయబోరు.
ఇక ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడిన మయాంక్ అగర్వాల్ చాలా కాలం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ కలిపి కేవలం 30 (13, 17) మాత్రమే చేశాడు. అతడిని తప్పిస్తే మరి రెండో టెస్టులో ఓపెనింగ్ ఎవరిని పంపిస్తారనే దానిపై చర్చ జరుగుతున్నది. వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహకు ఓపెనింగ్ చేసిన అనుభవం ఉండటంతో అతడిని బరిలోకి దింపవచ్చు. అయితే సాహ మెడ పట్టేయడంతో తొలి టెస్టులో ఎక్కువగా కేఎస్ భరత్ కీపింగ్ చేశాడు. దీంతో అతడు రెండో టెస్టుకల్లా ఫిట్‌గా ఉంటాడా లేదా అనేది అనుమానమే. మయాంక్‌ను తప్పించి.. సాహను ఓపెనర్‌గా పంపితే.. మిగిలిన వాళ్లు ఎప్పటిలాగానే తమ పాత బ్యాటింగ్ ఆర్డర్‌లోనే ఆడే వీలుంటుంది.
రహానేను తప్పిస్తారా?
తొలి టెస్టులో అజింక్య రహానే బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో రాణించిన రహానే.. ఆ తర్వాత ఇంత వరకు సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. ఇండియాలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ పర్యటనలో రహానే పూర్తిగా విఫలమయ్యాడు. అయినా సరే జాతీయ సీనియర్ సెలెక్టర్లు అతడికి మరోసారి అవకాశం ఇచ్చారు. కోహ్లీ, రోహిత్‌లు కూడా లేకపోవడంతో రహానేకే కెప్టెన్సీని కట్టబెట్టారు. కాన్పూర్ టెస్టులో అజింక్య రహానే తొలి ఇన్నింగ్స్‌లో 35, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే అవుటయ్యాడు. మ్యాచ్‌లో కీలక సమయంలో రహానే వికెట్ పారేసుకోవడంతో ఆ భారతమంతా అరంగేట్రం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు అశ్విన్, సాహ మోశారు.
అయితే రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ క్రికెటర్ కోచ్‌గా ఉన్న సమయంలో సీనియర్ల పట్ల ఎలా వ్యవహరిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కేవలం న్యూజీలాండ్ సిరీస్‌లోనే కాకుండా అంతకు ముందు జరిగిన 10 టెస్టుల్లో రహానే ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. అయితే కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించిన వ్యక్తిని తప్పించే సాహసం చేయరనే చెప్పుకోవచ్చు. మరోవైపు చతేశ్వర్ పుజార కూడా ఫామ్‌లో లేడు. అతడు సెంచరీ చేయక 1000 రోజులకు పైగానేఅవుతోంది. చివరి సారిగా 2019 జనవరిలో టెస్టు సెంచరీ చేసిన పుజారా.. ఇంత వరకు భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే అతడిని ఈ టెస్టు నుంచి తప్పించక పోవచ్చు. కానీ పుజార, రహానే వంటి సీనియర్లకు మెడపై కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుందని చెప్పవచ్చు.