ఐసీసీ చైర్మన్ రేసులో ఎవరు ముందంజ

by  |
ఐసీసీ చైర్మన్ రేసులో ఎవరు ముందంజ
X

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్ శశాంక్ మనోహర్ బుధవారం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రెండు నెలల క్రితమే ఆయన పదవీకాలం ముగిసినా కరోనా నేపథ్యంలో కొంతకాలం పొడిగించారు. మరో వారం రోజుల్లో కొత్త చైర్మన్ ఎన్నికల ప్రక్రియ మొదలు కానున్నది. ఈ క్రమంలో క్రికెట్ బోర్డులో అత్యున్నత పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది.

కొలిన్ గ్రేవ్స్

ఐసీసీ చైర్మన్ పదవికి మొదటి నుంచీ వినిపిస్తున్న పేరు ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్. శశాంక్ మనోహర్ వారసుడిగా నాలుగైదు నెలల నుంచి ఇతని పేరే ముందు వరుసలో ఉంది. క్రికెట్ పరిపాలనలో అనుభవం, వివేకం కలిగిన వ్యక్తిగా గ్రేవ్స్‌కు మంచి పేరు ఉంది. అలాగే ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా మద్దతు కూడా ఉంది. బీసీసీఐ తన అభ్యర్థిని నిలుపకపోతే గ్రేవ్స్‌నే చైర్మన్ పదవికి ప్రతిపాదించే అవకాశం ఉంది. కాగా, క్రికెట్ సౌతాఫ్రికా, శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లా, పీసీబీలు తమ ఓటును గ్రేవ్స్‌కు వేస్తాయా లేదా అనే అనుమానం నెలకొన్నది.

సౌరవ్ గంగూలీ

ప్రస్తుత బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఐసీసీ చైర్మన్‌గా బరిలో దిగుతారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు గంగూలీ కాని, బీసీసీఐ కాని ఈ విషయంపై పెదవి విప్పలేదు. దాదా బరిలో ఉంటే తమ మద్దతు ఉంటుందని శ్రీలంక, సౌతాఫ్రికా బోర్డులు ఇప్పటికే తెలిపాయి. బీసీసీఐ చైర్మన్ పదవికి సంబంధించిన సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఒకవేళ బీసీసీఐ తమ అభ్యర్థిగా సౌరవ్‌ను నిలిపితే తప్పకుండా గెలుస్తాడనే ధీమా క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది

ఇమ్రాన్ ఖవాజా

శశాంక్ మనోహర్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత మధ్యంతర చైర్మన్‌గా ఇమ్రాన్ ఖవాజా వ్యవహరిస్తున్నారు. వృత్తి రీత్యా లాయర్ అయిన ఖవాజా గతంలో సింగపూర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, ఒక అనుబంధ దేశం నుంచి ఐసీసీ చైర్మన్‌ను ఎన్నుకోవడానికి ఈసీబీ, బీసీసీఐ, సీఏ ఏ మేరకు ఒప్పుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

డేవ్ కామెరూన్

ఐసీసీ చైర్మన్ ఎన్నికల బరిలో నిలబడతానని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ డేవ్ కామెరూన్ స్పష్టం చేశారు. ఆయనకు యునైటెడ్ స్టేట్స్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ మద్దతు ఉంది. అయితే, శాశ్వత సభ్యత్వం కలిగిన రెండు క్రికెట్ బోర్డులు నామినేషన్‌ను ధ్రువీకరించాల్సి ఉంది. ఆ అవకాశం కామెరూన్‌కు లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

వచ్చే వారంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక అన్ని క్రికెట్ బోర్డులు తమ నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉన్న వాళ్లు కూడా ముందుకు వస్తారు. కాబట్టి మరో వారం రోజుల్లో ఎవరెవరు బరిలో ఉంటారనే విషయం తెలియనుంది.


Next Story