డ్రగ్స్ కేసులో ఎవరిని కాపాడుతున్నారు..?

by Anukaran |
డ్రగ్స్ కేసులో ఎవరిని కాపాడుతున్నారు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది. ఆ కేసులో ప్రముఖులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేస్తోంది. డ్రగ్స్ కేసు ముందుకు సాగకుండా అవరోధాలు సృష్టిస్తోందని ఎక్సైజ్ శాఖపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం గుర్రుగా ఉన్నది. దీనిపై హైకోర్టులో విచారణ సైతం జరిగింది. ఇంతకు ఏం జరిగిందంటే..

తెలంగాణలో 2017లో జూలై-ఆగస్టు మధ్యకాలంలో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో చాలా మంది వీఐపీలు, సినీ ప్రముఖులు పేర్లు వెల్లడయ్యాయి. వారిని అప్పటి ఐపీఎస్ అధికారులు విచారించారు. ఆ తర్వాత ఆ కేసు పురోగతి ఎక్కడిదాకా వచ్చిందో స్పష్టత లేదు. ఈ కేసు విషయంలో దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేసి బాధ్యులను చట్టప్రకారం శిక్షించాలని గతంలో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టుకు కూడా ఇప్పటి వరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి పూర్తి స్థాయి వివరాలు కౌంటర్ అఫిడవిట్ రూపంలో దాఖలు కాలేదు. చివరకు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయినా ఆశించిన ఫలితం లేదు. ఇదే సమయంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ లేదా ఈడీ లేదా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటివాటికి అప్పగించాలని కోరారు.

అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్న స్పందించడం లేదు. డ్రగ్స్ కేసులో సినీ నటులు, ప్రముఖులు, ఇతర సెలబ్రిటీల వివరాలు, కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లను, ఛార్జిషీట్‌లను, నిందితుల నుంచి సేకరించిన రికార్డెడ్ స్టేట్‌మెంట్లను ఇవ్వడం లేదని ఈడీ మొత్తుకుంటోంది. మూడేళ్ల నుంచి ఎన్ని లెటర్లు రాసినా ఇప్పటికీ స్పందన లేదని వాపోయింది. మొత్తం 12 కేసులు ఉన్నాయంటోందే తప్ప, వాటి వివరాలను మాత్రం ఇవ్వడంలేదని అసహానం వ్యక్తం చేసింది. ఆ వివరాలు లేకుండా తాము ఎలా దర్యాప్తు చేపట్టగలమని ప్రశ్నిస్తోంది.

కాగా డ్రగ్స్ కేసు పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై కేంద్రం తరఫున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన డిప్యూటీ డైరెక్టర్ లిఖితపూర్వకంగా హైకోర్టుకు వివరణ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో దాదాపు పన్నెండు ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు తమ దగ్గర సమాచారం ఉందని, కొన్నింటిలో ఛార్జిషీట్‌లు కూడా ఫైల్ అయ్యాయని, కానీ తాము ఎంత అడిగినా మూడేళ్లుగా ఎలాంటి సమాచారం అందడంలేదని కోర్టుకు తెలియజేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది మాత్రం తగిన గడువు ఇస్తే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మూడేళ్లుగా ఎలాంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

ఇకనైనా దాఖలు చేయాలని, మూడేళ్ల నుంచి కాలం నెట్టుకొస్తున్న ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం అని కోర్టు స్పష్టం చేసింది. డ్రగ్స్ కేసులో చాలా మంది సినీ నటులు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నందున ఉద్దేశపూర్వకంగానే ఎక్సైజ్ శాఖ తొక్కిపెట్టిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇకపైన ఎవరెవరు ఉన్నారో పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 17న తదుపరి విచారణ జరగనున్నందున సినీ నటులకు డ్రగ్స్ వ్యవహారంతో ఏ మేరకు సంబంధం ఉందో తేటతెల్లం కానుంది.

Advertisement

Next Story

Most Viewed