నేను చచ్చిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను

by  |
నేను చచ్చిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను
X

దిశ, వరంగల్: మీరు ఈ వార్త చదివారంటే.. ఇదేంటని విస్తుపోతారు. ఎందుకంటే అక్కడ ఇదే జరిగింది. మృతిచెందిన వారికి లెక్కలోకి తీసుకోరు. కానీ, ఆమె బతికే ఉండగానే అధికారులు మృతిచెందిందని లెక్కలు చూపిస్తున్నారు. ఆ వివరాలేమిటో మీరే చదవండి..

బాధితురాలి కథనం ప్రకారం.. విషయమేమిటంటే..

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి ఎలీషా అనే మహిళకు నాలుగు నెలల నుంచి రేషన్ బియ్యం, చక్కెర ఇవ్వడం లేదు. ఇదేందని అడిగితే నీ కార్డును తీసేశారని ఆమెకు ఆ డీలర్ బదులిచ్చాడు. వెంటనే ఆమె తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేస్తే అసలు విషయం బయటపడింది. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డ్ తో నిరసనకు దిగింది.

మల్లంపల్లి గ్రామ వాసి అయిన ఎలీషా ఆమె రెండు పర్యాయాలు వార్డు సభ్యురాలిగా పనిచేసింది. అంతేకాదు గత ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. అప్పటి నుంచే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, రేషన్ షాపు నిర్వహిస్తున్నటీఆర్ఎస్ నాయకుడు కావాలనే తాను చనిపోయాయని అధికారులకు చెప్పి కార్డును రద్దు చేయించారని ఆమె ఆరోపిస్తోన్నది. బతికి ఉన్నవాళ్లను చనిపోయినట్లుగా చూపించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ ప్లకార్డుతో నిరసన చేపట్టింది. ఆమెకు మద్దతుగా రఘునాథపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తహశీల్దార్ బన్సీలాల్ ను కలిసి వినతి ప్రతం అందజేశారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed