ఏది కరోనా? ఏది వైరల్? గుర్తించండి ఇలా..!

by Anukaran |   ( Updated:2021-08-18 11:24:37.0  )
Fever Symptoms
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా, సీజనల్ జ్వరాల లక్షణాలు ఇంచుమించు ఒకే విధంగా ఉండటంతో ఏది కరోనా? ఏది వైరల్ జ్వరమో? గుర్తు పట్టడం ప్రజలకు సాధ్యపడటం లేదు. ఈ క్రమంలో చాలా మంది కరోనా అనే అనుమానంతో ఫీవర్ సర్వేలో ఇచ్చిన మెడికల్ కిట్లను వాడుతున్నారు. దీంతో సదరు వ్యక్తుల్లో డెంగీ, మలేరియాలు ఉంటే రీయాక్షన్లు వస్తున్నట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. కొందరైతే ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్లినట్లు వైద్యారోగ్యశాఖ పరిశీలనలో తేలింది. దీంతో జ్వర లక్షణాలున్నోళ్లంతా వెంటనే వైద్యున్ని సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేపించుకోవాలని అధికారులు సూచించారు.

ఇప్పటికే తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లలో అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. తర్వాత డాక్టర్ రాసిచ్చిన మందులు వాడాలని, ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్, గూగుల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్‌ను పాటించవద్దని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఒక వేళ డెంగీ వ్యాధి నిర్ధారణ తర్వాత ప్లేట్ లెట్స్ తగ్గితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్లడ్ బ్యాంక్‌ల నుంచి తీసుకోవచ్చని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

జీహెచ్ఎంసీలో 50 శాతం డెంగీ కేసులే..

కరోనా తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న హైదరాబాద్ పట్టణ వాసులకు డెంగీ దడపుట్టిస్తున్నది. రాష్ర్ట వ్యాప్తంగా నమోదవుతున్న రోజు వారీ కేసుల్లో సుమారు 50 శాతం జీహెచ్ఎంసీ ప్రాంతం నుంచి తేలడం ఆందోళన సృష్టిస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1206 కేసులు తేలగా, హైదరాబాద్‌లో ఏకంగా 447 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా ఖమ్మంలో 122, రంగారెడ్డిలో 115, మేడ్చల్‌లో 89, ఆదిలాబాద్‌లో 68, కొత్తగూడెంలో 48, నిజామాబాద్‌లో 38, నిర్మల్‌లో 35 కేసులు తేలినట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది.

అయితే గడిచిన రెండేళ్లతో పోల్చితే ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యలతో సుమారు 75 శాతం కేసులు తగ్గాయి. 2019లో రాష్ర్ట వ్యాప్తంగా ఏకంగా 13,361 డెంగీ కేసులు నమోదవగా, 2020లో కేవలం 2173 మాత్రమే వచ్చాయి. కానీ డెంగీ వ్యాధితో గడిచిన నాలుగేళ్లలో కేవలం 9 మంది మాత్రమే చనిపోవడం గమనార్హం.

ఆదివాసీ ప్రాంతాల్లో మలేరియా వ్యాప్తి..

ఆదివాసీ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా వ్యాప్తి పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెంలో 220 కేసులు నమోదవగా, ములుగులో 129 కేసులు తేలాయి. అదే విధంగా వరంగల్ అర్బన్‌లో 22 కేసులు వచ్చినట్లు వైద్యశాఖ అధికారిక లెక్కల్లో పొందుపరిచింది. ఆ వ్యాధి కూడా రెండేళ్లతో పోల్చితే 50 శాతం కేసులు తగ్గాయి. రాష్ర్ట వ్యాప్తంగా 2019లో 1711 మలేరియా కేసులు రాగా, 2020లో కేవలం 509 మాత్రమే నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో మలేరియాతో ఒక్కరు కూడా చనిపోలేదని వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. కేసులు సంఖ్య కూడా అతి తక్కువగా తేలాయి. గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతోనే వ్యాధులు తగ్గుముఖం పడుతున్నాయన్నది. ప్రీ ఎలిమినేషన్ దశ నుంచి ప్రస్తుతం ఎలిమినేషన్ దశకు చేరుకోగా, అతి త్వరలో కేటగిరీ జీరోకు చేరుకోబోతున్నట్లు వైద్యశాఖ స్పష్టం చేసింది.

దోమల నివారణకు ప్రభుత్వం చేయబోతున్న కార్యక్రమాలు ఇవే..

13 జిల్లాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీ రాజ్ సిబ్బందికి సూచించారు. అంతేగాక యాంటీలార్వాలను కార్యక్రామాలను విస్ర్తృతంగా చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ఫోకస్ పెట్టాలని గ్రామ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అంతేగాక దోమల దరిచేరకుండా కొన్ని రకాల ఆయూర్వేద చెట్లను గ్రామాల్లో నాటనున్నారు. అంతేగాక ప్రతీ సండే పది నిమిషాల డ్రై డే పై అవగాహన కల్పించనున్నారు.

లక్షణాల్లో తేడాలు ఇలా గుర్తించండి..

కరోనా సీజనల్
తీవ్ర జ్వరం ఉంటుంది. సాధారణ జ్వరం ఉంటుంది
మూడు రోజులైనా తగ్గదు. మూడు రోజుల్లో తగ్గుతుంది
జలుబు ఉన్నా ముక్కు కారదు. ముక్కు కారుతుంది
పొడి దగ్గు వస్తుంది. కఫంతో కూడిన దగ్గు వస్తుంది
రుచి, వాసన తెలియదు. రుచి, వాసన తెలుస్తుంది
ఒంటినొప్పులు తీవ్రంగా ఉంటాయి. సాధారణంగా ఉంటాయి
తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఉంటుంది
గొంతునొప్పి ఉంటుంది. గొంతునొప్పి ఉంటుంది
ఛాతిలో నొప్పి వస్తుంది. ఛాతి నొప్పి ఉండదు
కండ్లు ఎర్రబడతాయి. కండ్లు ఎర్రబడవు
వాంతులు, విరేచనాలు ఉంటాయి. వాంతులు, విరేచనాలు ఉంటాయి

Advertisement

Next Story

Most Viewed