- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ భూ సమస్యలకు ఏంటీ పరిష్కారం?
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఎన్నో ఏండ్లుగా భూ సమస్యలతో పోరాడుతున్న ప్రజలకు ధరణి పోర్టల్ తో మేలు జరుగుతుందని ఆశించారు. కానీ సమస్యలు మరింత జఠిలమై బంధాలకు, అనుబంధాలకు విలువ లేకుండా గొడవలకు దారి తీస్తోంది. అంతేకాకుండా భూమి లేని నిరుపేదలకు గత ప్రభుత్వాలు అసైన్డ్ కమిటీతో రెండు లేదా, మూడు, నాలుగు, ఐదు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేశారు. ఆ భూములను సుమారుగా 30 ఏండ్లకు పైగా రైతులు సేద్యం చేసుకుంటున్నారు.
ఇలాంటి భూములకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాసుబుక్ ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్ధాయిలో భూములను సాగు చేసుకుంటున్నప్పటికి ధరణి వెబ్ సైట్లో రైతుల పేరు, సర్వే నెంబర్, ఖాతా నెంబర్లు లేకపోవడం గమనార్హం. ఎప్పటి నుంచో అసైన్డ్ రికార్డుల్లో నమోదైన భూములు వంశపారంపర్యంగా వచ్చే సరికి ధరణిలో నమోదు చేయకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలోని పేద, నిరుపేదలైన రైతులు భూములను కొల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో సుమారుగా వందల ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను రికార్డుల్లోంచి తొలగించినట్లు సమాచారం.
– రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 311లో కుమ్మరిగూడానికి చెందిన గ్రామ ప్రజలు ఎన్నో యేండ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ఇందులో కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న కొంత మంది రైతులకే ధరణి పోర్టల్లో నమోదు చేసి కొత్త పాసుబుక్‌లు జారీ చేశారు. సుమారుగా వంద మంది రైతులకు సంబంధించిన వివరాలు ధరణిలో కనుమరుగయ్యాయి.
– రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలోని 542 సర్వే నెంబర్లో సీలింగ్, పట్టా భూములున్నాయి. అయితే ఇందులో కొనుగోలు చేసిన పట్టాదారుల భూములను సీలింగ్ భూములుగా, సీలింగ్ భూములను పట్టా భూములుగా మార్చి దళిత, బీసీ వర్గాల ప్రజలతో స్ధానిక రెవెన్యూ అధికారులు ఆటలాడుతున్నారు.
బాధితులు తహశీల్ధార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగి, తిరిగి చెప్పులు అరిగిపోయాయే తప్పా, పని కాలేదు. ఇక ఓపిక లేని బాధిత కుటుంబాలు తలకొండపల్లి తహశీల్ధార్ కార్యాలయం ముందు రిలే నిరహార దీక్షలు చేపట్టారు. బాధిత రైతులు పైసా పైసా జమ చేసుకోని టెంట్ వేయిస్తే పోలీసులు జోక్యం చేసుకొని దాని తీసేశారు.
అసైన్డ్ భూములు నమోదు చేయాలి- సీపీఐ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం రైతుల భూములను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకట్ రెడ్డి హజరయినారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశించారని అన్నారు.
ఈ ధరణి పోర్టల్ కబ్జా కోరులకు, పైరవీకారులకే పనికొచ్చిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కమ్యూనిస్టు పోరాటాలతో అసైన్డ్ కమిటీ వేసి భూ పంపిణి చేశారని అన్నారు. అలాంటి పేదల భూములను లాగేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. భూ సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులకు రైతులు గురవుతున్నారని పేర్కొన్నారు.
తహశీల్ధార్ కార్యాలయాల చుట్టూ, ఆర్టీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అర్హులైన రైతుల అసైన్డ్ భూములను రికార్డుల్లో నమోదు చేయాలి, అనంతరం ధరణి పోర్టల్లో అప్డేట్ చేసి పాసుబుక్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బీ.దత్తు నాయక్, బీకేఎంయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర గణేష్, సిహెచ్ జంగన్న, బ్రహ్మచారిలతో పాటు రైతులు కోటేష్, శివ, సురేష్, నరసింహ, ప్రభాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.