పురాతన కట్టడాలకు పునర్నిర్మాణమెప్పుడో..?

by Shyam |   ( Updated:2021-02-14 23:54:45.0  )
పురాతన కట్టడాలకు పునర్నిర్మాణమెప్పుడో..?
X

దిశ నిజామాబాద్ రూరల్ : పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాల్సిన ఆనాటి కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పూర్వం రాజులు, జమీందారుల రక్షణ కోసం నిర్మించుకున్న కోటలు కూలిపోతున్నాయి. అయితే చరిత్ర కలిగిన పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం, పురావస్తు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రూరల్ నియోజకవర్గ పరిధి సిర్నాపల్లి గ్రామంలోని నిజాం కాలంలో శీలం జానకీ పరిపాలించిన గడి, గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న చావిడి, చెరువు కట్టపై ఏర్పాటు చేసిన మూడంచెల తూము ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శిస్తున్నారనే తప్ప పునర్నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటి పరిరక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు ఎన్నో వినతిపత్రాలు అందజేశామని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తద్వారా అవి రోజురోజుకూ శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇప్పటికైనా వారి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా, పంచాయతీ పాలక వర్గం శీలం జానకీ బాయి పరిపాలించిన కోటను గ్రంథాలయంగా మార్చేలా కృషి చేశారు.

సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీ బాయి దాదాపు 40 గ్రామాలను పైగా పరిపాలించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని, ముందు చూపుతో చెరువులు, కుంటలు తవ్వించి ఆయకట్టుకు నీరందించే విధంగా కృషి చేశారని స్థానికులు చెబుతుంటారు. సిర్నాపల్లి గ్రామ చెరువు ద్వారా దాదాపు పది గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండేలా ప్రత్యేక కాల్వను ఏర్పాటు చేసి ముందు చూపుతో రైతులకు ఎంతో మేలు చేసిందని ఆమె సేవలను అన్నదాతలు నేటికీ కొనియాడుతుంటారు.

ఉత్తమ గ్రామ పంచాయతీగా సిర్నాపల్లి

సిర్నాపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తం యువత ఉండడంతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మియావాకి పద్ధతిలో మొక్కలు పెంపకం జరిపి రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీగా గ్రామాన్ని నిలిపేలా కృషి చేశారు. అదే స్ఫూర్తితో హరితహారం మొక్కల పెంపకం చేపట్టి గ్రామాభివృద్ధి కమిటీ, పంచాయతీ పాలకవర్గ సిబ్బందితో సిర్నాపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. గ్రామంలో వందశాతం ఇంటి పన్ను వసూళ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. గ్రామానికి వచ్చే నిధులను ఎలా ఉపయోగించుకోవాలనే విషయమై ప్రతీ పదిహేను రోజులకోసారి గ్రామసభలు నిర్వహించి, ప్రజల సమక్షంలో అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుంటున్నారు.

పురాతన కట్టడాల రక్షణకు నిధులను మంజూరు చేయాలి.

తేలు విజయ్. ( గ్రామ సర్పంచ్)
రాష్ట్ర ప్రభుత్వం అధికారులు,ప్రజాప్రతినిధులు మా జానకీబాయి గడి, చావిడి, మూడంచెల తూము పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. గ్రామంలోని పురాతన కట్టడాలను కాపాడుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ వారు పట్టించుకుంటే బాగుంటుంది.

Advertisement

Next Story