పేదల స్థలాల జోలికి వస్తే ఊరుకునేది లేదు : డీకే అరుణ

by Shyam |   ( Updated:2021-09-23 06:37:21.0  )
పేదల స్థలాల జోలికి వస్తే ఊరుకునేది లేదు : డీకే అరుణ
X

దిశ, గద్వాల : గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం 39 ఎకరాలు సేకరించి, పట్టాలు పేద ప్రజలకు ఇస్తే స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఇళ్లకు ఇచ్చిన భూమిని నర్సింగ్ కాలేజ్ కట్టాలని ప్రయత్నం చేయడం సిగ్గు చేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. గురువారం స్థానిక దర్గా వెనుకాల వద్ద పేదల ఇళ్లకు పంచిన భూమిలో ఆమె బాధితులతో సందర్శించారు. బాధితులు పెద్ద సంఖ్యలో రావడం, తమ ఇళ్ల స్థలం కోసం, ప్లాట్ కోసం వేసిన రాళ్ల నెంబర్ లను వెతకడం ప్రారంభించారు. తమకు 2013లో ప్రభుత్వం ఇళ్ల స్థలం కోసం పట్టా ఇచ్చిందని ఇప్పుడేమో అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నేతలేమో నర్సింగ్ కళాశాల కట్టుటకు మా స్థలాలను గుంజుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి డీకే అరుణ మాట్లాడుతూ.. గతంలో నేను మంత్రిగా ఉన్న సమయంలో 39 ఎకరాలను రైతుల నుండి ప్రభుత్వ కొనుగులు చేసి గద్వాల నగరంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. సుమారు 1250 మందికి ఇళ్ల స్థలం కోసం పరిశీలన చేసి లేఅవుట్ చేసి ఉచితంగా పంపిణీ చేశామని ఇప్పుడేమో టీఆర్ఎస్ నాయకులు ఇదే స్థలంలో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి ఈ భూమిని చూపించడం జరుగుతోందని ఆమె తెలిపారు.

పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో కాకుండా వేరే స్థలంలో నర్సింగ్ కళాశాల కట్టాలని ఆమె డిమాండ్ చేశారు. పేదల స్థలాల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదలకు ఇళ్ల స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ఆమె మండి పడ్డారు. అధికారులు గతంలో ఇంటింటికి తిరిగి విచారణ చేసిన తరువాతనే అప్పుడున్న స్థానిక రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారని, ఇప్పుడేమో అధికారులు స్థానిక టీఆర్ఎస్ నాయకుల మాటలు విని ఇళ్లకు పాతిన రాళ్లను తొలగిస్తున్నారన్నారు. వెంటనే రాళ్లు తీసిన చోట అధికారులు రాళ్లను పాతి ఎవరికి సంబంధించిన ప్లాట్లను వారికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు గుంట కాడ నక్క లాగా కాచుకు కూర్చొన్నారని రియల్ ఎస్టేట్, ఇసుక, మట్టి, కంకర అక్రమంగా వ్యాపారాలు చేసి పేదలను దోచుకొంటున్నారని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్ర రెడ్డి, గడ్డం కృష్ణ రెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట రాములు, బీజేపీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు శంకర్, ఇస్సాక్, సీనియర్ సిటిజన్ ఫోరమ్ సభ్యులు పాల్గొన్నారు.


Next Story