- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మన్యంలో మినీస్టేడియం ఎప్పుడో?
దిశ, భద్రాచలం: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. దేహధారుడ్యానికి దోహదపడతాయి. యువత నడుమ స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని టోర్నమెంట్స్ ప్రారంభ, ముగింపు సభలకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించే ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం క్రీడల ప్రాక్టీస్, టోర్నమెంట్స్‌కి ఉపయోగపడే క్రీడామైదానాల గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదు. మండలాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు కృషి చేస్తామని పలుమార్లు హామీలు గుప్పించే అధికార యంత్రాంగం ఆ సంగతి మర్చిపోతున్నారు. ఆటలు ఆడుకొనే చోటు లేకపోవడంతో యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం యువతకి ఎంతో ఉపయోగపడే ఆటస్థలాల కోసం నిథులు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది.
మన్యం యువతకి ఆటలపై మక్కువ..
మన్యం యువతకి క్రీడల పట్ల మక్కువ ఎక్కువ. ఇక్కడ వివిధ క్రీడల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నా వారికి సరైన ప్రోత్సాహం లభించడంలేదు. ఏడాదికో, రెండేళ్లకో ఓసారి పోలీసులు వాలీబాల్ పోటీలు పెడుతుండగా, లోకల్‌గా యువత ముందుకొచ్చి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహిస్తోంది. ఇంతకు మించిన ప్రోత్సాహం లేదు. దానికి ప్రధాన కారణం క్రీడాస్థలాల కొరత. ఈ కొరత ఎప్పుడు తీరుతుందోయని క్రీడాకారులు, క్రీడాభిమానులు నిరీక్షిస్తున్నారు. కనీసం విద్యార్థులు ఆడుకోవడానికి మన్యం పాఠశాలల్లో అనువైన స్థలాలు కూడా లేవు. పిల్లల పరిస్థితి వానాకాలం చదువులు, ఎండాకాలం ఆటలు అన్నట్లుగా తయారైంది మండల కేంద్రాల్లో సరైన క్రీడామైదానాలు లేకపోవడంతో ఏజెన్సీ యువతకి ఆటలు అందనిద్రాక్షగా మారాయనే ఆరోపణలు నెలకొన్నాయి. ఏజెన్సీ యువత ఆటలపై మక్కువతో ఖాళీజాగలు, వరికోతలు ముగిసిన పొలాలనే తాత్కాలిక ప్లేగ్రౌండ్స్‌గా తయారుచేసి ఆటలు ఆడుకొని యువత తమ సరదా తీర్చుకొంటున్నారు. మన్యంలో యువత ఎక్కువగా వాలీబాల్, క్రికెట్, షటిల్ ఆటల పట్ల ఇంట్రెస్టు చూపిస్తారు.
అమలుకు నోచుకోని మినీస్టేడియం హామీలు..
అనేక సందర్భాల్లో మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉన్నత అధికారులు మండలాల పర్యటనలకు వచ్చినపుడు గంపెడు ఆశతో యువత వారిని కలిసి క్రీడామైదానాల లోటు గురించి వినతిపత్రాలు అందజేస్తుంటారు. ఈసారి తప్పనిసరిగా యువత అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాల ఏర్పాటుకు కృషి చేస్తామని క్రీడాకారులు, క్రీడాభిమానుల హర్షధ్వానాల నడుమ ప్రకటిస్తారు. ఊరిదాటిపోగానే సదరు పెద్దమనుషులు యువతకి ఇచ్చిన హామీ మరచిపోతారు. దీంతో యువత సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నెలకొంటుంది. ఆటస్థలాల గురించి డివిజన్ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిథులు ఎన్నికల సమయాల్లో ఇచ్చే హామీలు నీటిమీద రాతలుగానే కనుమరుగైపోతున్నాయి.
పీవో గారూ… మీరైనా కరుణించరూ..
భద్రాచలం ఏజన్సీప్రాంత మారుమూల మండలాల్లో గిరిజన క్రీడాకారులకు ప్రోత్సాహంగా కనీసం మండల కేంద్రాల్లో అయినా ఆటస్థలాలను ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేయాలని గిరిజన యువత కోరుతున్నారు. గిరిజన విద్యార్థులను క్రీడారంగంలో ప్రోత్సహిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మండలాల్లో గిరిజన యువతకు అందుబాటుగా నిత్యం ప్రాక్టీస్‌కి ఉపయోగకరంగా మినీ స్టేడియాలు నెలకొల్పాలని గిరిజన క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయలేక పోటీల్లో రాణించలేక పోతున్నామని గిరిజన యువత మథనపడుతున్నారు. ప్లేగ్రౌండ్స్ లేకపోవడం వలన ఎక్కువ టోర్నమెంట్స్ జరగడంలేదని, ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చి మారుమూల మండలాల్లో ఆటలపోటీలు పెట్టాలంటే బహుమతులు, ఇతర ఖర్చులకంటె ప్లేగ్రౌండ్ తయారు చేయడానికే ఎక్కువ ఖర్చు అవుతోందని వాపోతున్నారు. అందుకే టోర్నమెంట్స్ నిర్వహణకు ఎవరు సాహసించడంలేదు. కనీసం మండల కేంద్రంలో ఒక్క ఆట స్థలం ఉన్నా రకరకాల క్రీడల ప్రాక్టీస్, నిర్వహణకి ఎంతగానో దోహదపడుతుందని గిరిజన యువత కోరుతుంది. ఐటీడీఏ పీవో గారూ.. మీరైనా మా మొర ఆలకించి గిరిజన క్రీడాభివృద్ధికై మినీ స్టేడియాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మన్యం యువత కోరుతున్నారు.