గత అనుభవాలను ఓసారి గుర్తుచేసుకుందామా..?

by Shyam |
గత అనుభవాలను ఓసారి గుర్తుచేసుకుందామా..?
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్‌తో సావాసం తప్పదని తేలిపోయింది. వైరస్ నియంత్రణకు స్వీయ రక్షణ చర్యలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో గడప దాటాలంటే నోటికి, ముక్కుకు మాస్క్ తప్పనిసరి కాగా, లేకుంటే రూ.1000 జరిమానా చెల్లించాల్సిందే. ఐతే మాస్క్‌ల పేర రోజూ జేబుకు చిల్లు పడాల్సిందేనా ? పేద, మధ్య తరగతి వర్గాలు ఈ అదనపు ఖర్చును భరించాల్సిందేనా? మనల్ని మనం కాపాడుకోవాలంటే మరో మార్గం లేదా? అన్నసందేహాలు కలుగకమానవు. వైరస్ వ్యాప్తి తొలి రోజుల్లో ప్రెస్ మీట్లల్లో మాస్క్‌లు ధరించి కనిపించిన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌.. ఈ మధ్య భుజాన తువ్వాల(కండువా)తో దర్శనమిస్తున్నారు. మరి జనమెందుకు మాస్క్‌ల కోసం జేబులు గుల్ల చేసుకుంటున్నారు? కాస్త మూలాల్లోకి వెళ్లి చూస్తే.. దాని వెనకున్న సైన్స్ అర్థమవుతుంది. ప్రాచీన సంస్కృతితోనే స్వీయ నియంత్రణ సాధ్యమన్న విషయమూ మనకు బోధపడుతుంది. ఈ నేపథ్యంలో గతానుభవాలను ఓసారి గుర్తుచేసుకుందాం !

ప్రతి వ్యక్తి భుజాన కండువే రక్ష

కొన్నేండ్ల కిందటి వరకు ప్రతీ వ్యక్తి భుజాన తువ్వాల/కండువా/తుండుగుడ్డ తప్పనిసరిగా ఉండేది. అదేదో ఒకరికి సొంతమైన అలవాటు కాదు. కుల, మతాలకతీతంగా, వృత్తితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి భుజాన సంస్కృతికి చిరునామాగా, పెద్దరికానికి చిహ్నంగా ప్రతిబింబించేది. ఎక్కడైనా కూర్చోవాలంటే భుజాన ఉండే తువ్వాలతో దులిపిన తర్వాతే ఆసీనులయ్యేవారు. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా.. ఆఖరికి ఎక్కడైనా దుర్వాసనా వచ్చినా, దుమ్ములేసినా అడ్డం పెట్టుకొనేవారు. కాలక్రమేణా కండువా కాస్త కర్చీఫ్‌గా మారింది. కొన్ని రోజులకు అది కూడా భారమై న్యాప్‌కిన్‌ కోసం వెతుకులాట ప్రారంభమైంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌లతో పాటు ముఖానికి కర్చీఫ్‌ల అవసరం ఏర్పడింది. అయితే మన ప్రాచీన సంస్కృతిని మరవడం వల్లే సమాజం ఇబ్బంది పడుతోందని సేవ్‌, భారతీయం, ఇస్కాన్‌ దైవవర్ణాశ్రమ మినిస్ట్రీ, సహస్ర వేదిక్‌ సేవాసమితి వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఇలాంటి ప్రచారాన్ని మొదలు పెట్టారు. మాస్క్‌లను ధరించడం కన్నా ఎక్కువ మడతలతో కండువా కప్పుకోవడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చని అంటున్నారు. వీటిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

పాశ్చాత్య నాగరికతతోనే సమస్య : వసుధామ దాస, ఇస్కాన్‌ దైవవర్ణాశ్రమ మినిస్ట్రీ ప్రతినిధి

పాశ్చాత్య నాగరికతతోనే మనం సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. మన సంస్కృతి, సంప్రదాయాలతోనే ఆరోగ్యం. గతంలో ప్రతి ఒక్కరూ భుజాన కండువా ధరించేవారు. ఇప్పుడేమో అది భారమై మాస్క్‌ల బాట పట్టాం. శ్రీఇషోపనిషత్తులో వైరస్‌-జీవం గురించిన ప్రస్తావన ఉంది. చీమ, దోమ.. మైక్రో ఆర్గానిజం ఉంటుంది. అలాగే వైరస్‌ అవసరమే. కానీ, ఎలాంటి విపత్తు నుంచి వచ్చిందో గ్రహించాలి. ప్రకృతిని, జీవులను విధ్వంసం చేసే వైరస్‌ నుంచి రక్షణ పొందాలి. ఐతే మన కల్చర్‌లోనే వైరస్‌ నియంత్రణ ఉంది. దాన్ని ఆచరించకుండా పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడడం వల్లే ఇబ్బంది పడుతున్నాం.

ఆరోగ్యానికి రక్ష తువ్వాల: సురేంద్రనాధ్‌, సేవ్‌ సొసైటీ ప్రతినిధి

1990 కంటే ముందు వైద్యులంతా గ్రీన్‌ కలర్‌ దుస్తుల్లో కనిపించేవారు. ప్రధానంగా శస్త్ర చికిత్స చేసేటప్పుడు వాటినే ధరించేవారు. ఆ తర్వాత ఉతికించి మళ్లీ ధరించేవారు. ఇప్పుడేమో అన్నీ సింగిల్‌ యూజ్‌ మాత్రమే. తుమ్ము, దగ్గు, జలుబు నుంచి రక్షణకు తువ్వాలనే వినియోగించేవాళ్లం. ఇప్పుడేమో దాన్ని వెనుకబాటుతనంగా చూస్తున్నాం. కానీ ఆ ఆచారం వెనుక ఎంతటి మర్మమున్నదో గ్రహించడం లేదు. అందుకే మేం ఆరోగ్యానికి రక్షగా తువ్వాలు/తుండుగుడ్డను చూడాలని కోరుతున్నాం. ఎవరి వస్త్రాన్ని వారి కోసమే వినియోగించడం ఎంత శ్రేష్ఠమే గ్రహించాలి.

టిష్యూ పేపర్‌.. అంటే ? : సురేష్‌గుప్తా, పర్యావరణ ప్రేమికుడు

టిఫిన్‌ చేసినా, భోజనం చేసినా.. ఆఖరికి ముక్కు తీసినా టిష్యూ పేపర్‌ కోసం వెతుకుతున్నారు. కానీ అదెట్లా తయారైందో గుర్తించడం లేదు. దానికి బదులుగా ప్రతి ఒక్కరూ ఓ తుండుగుడ్డను వాడటం ద్వారా సమాజానికి ఎంత మేలు చేసిన వారవుతారో ఆలోచించండి. అన్ని కాలాలకు రక్షణగా నిలుస్తుంది. దాంతో పాటు ఎలాంటి అనుమానాలకు తావివ్వదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాడుకోవచ్చు. ఆ తర్వాత వేడి నీళ్లల్లో ఉతికి మళ్లీ మళ్లీ వాడొచ్చు.

ప్రాచీన సంప్రదాయమే శ్రీరామ రక్ష: డా.రమేష్‌సాగర్‌, హయత్‌నగర్‌

మన పూర్వీకులు ఆచరించిన ప్రతి అంశంలోనూ శాస్త్రీయత దాగి ఉన్నది. ఏ వస్తువైన సొంతంగా ఉంటేనే బాగు. ఒకరు వాడుతున్నది మరొకరు వాడకుండా ఉంటేనే మంచిది. కానీ, టిష్యూ పేపర్‌ వినియోగం మంచిది కాదు. కానీ కండువా వంటివి మన నాన్న, తాతలు వినియోగించినదే. అవి ఎంత రక్షణ ఇచ్చాయో ఓ సారి పరిశీలిస్తే అర్ధమవుతోంది. ప్రాచీన అలవాట్ల వెనుక ఉన్న ఆంతర్యాన్ని మేం ప్రచారం చేస్తున్నాం.

tags:, , ,

slug:

Advertisement

Next Story

Most Viewed