- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాటల మాటున మర్మమేంటో?
దిశ ప్రతినిధి, ఖమ్మం : టికెట్ దక్కకపోవడం.. ‘పెద్దలు’ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం.. స్థానిక నాయకులు, పార్టీతో ఉన్న అంతర్గత విభేదాలు వెరసి ఇంతకాలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేనట్టుగానే ఉన్నారు. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏమైందో ఏమోగానీ దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత మంత్రి కేటీఆర్ ఖమ్మం వచ్చి సముదాయించడంతో పొంగులేటి చల్లబడ్డారు. అప్పటి వరకూ ఉన్న ‘అన్ని రకాల’ స్పర్థాలు, విభేదాలు పక్కన పెట్టి ఎప్పటిలాగే యాక్టివ్ గా పర్యటనలు, కార్యక్రమాలు చేస్తున్నారు. తమ నేతకు ఇంత కాలానికి ‘భరోసా’ లభించిందంటూ ఆయన అభిమానులు, వర్గీయులు సంబురాలు చేసుకున్నారు. కేడర్ కూడా తమ లీడర్ కోసం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం పొంగులేటి చేసిన హాట్ కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడమే కాదు.. ‘కొటరీ’లో మళ్లీ ముసలం మొదలైనట్టయింది.
అసలేమైందంటే..
ఆదివారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ప్రధాన అనుచరులైన మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మట్టా దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలంలో పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు జిల్లా నేతలు తమను కావాలనే ఇబ్బంది పెడతున్నారని, తమపై కేసులు పెట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు మనం కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నాం కదా అంటూ పొంగులేటి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతోనే ఆవేదనకు గురైన పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు, అధికారం ఎవడబ్బ సొత్తూ కాదని, రావాలనుకుంటే ఎవ్వరు ఆపినా వస్తాయన్నారు. అంతేకాదు తనను నమ్ముకున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తే చక్రవడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. అధికారం పోవాలని ఉంటే కాంక్రీట్ గోడలు కట్టుకున్నా పోతాయని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి.
ఎవరిని ఉద్దేశించి అన్నట్టు..?
పొంగులేటి చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. అసలు ఎవరిని ఉద్దేశించి శ్రీనివాసరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారా..? అనే చర్చ మొదలైంది. ఇంతకాలం ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా మూడు వర్గాలు ఉన్నాయి. అయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, పొంగులేటికి కొంతకాలంగా వర్గ విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఇటీవల ఖమ్మం వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు తొలగించి కలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. దీంతో అంతర్గతంగా ఇద్దరికీ ఎలా ఉన్నా పైకి మాత్రం కలిసిపోయినట్టే ఉన్నారు. ఇక సత్తుపల్లి నియోజకవర్గం తుమ్మలకు కంచుకోట. ఆయన అనుచరగణం అక్కడ బాగానే ఉంది. తుమ్మలకు, పొంగులేటికి కూడా పొసగట్లేదన్న విషయం కూడా బహిరంగ రహస్యమే. ఎంపీ నామా నాగేశ్వరరావుతో కూడా విభేదాలు నడుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు, తుమ్మల అనుచరులకు కూడా విభేదాలు ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఇన్ని కారణాల నేపథ్యంలో ఇంతకీ పొంగులేటి ఫైర్ అయింది ఎవరి మీద అన్నది కొంత ఆసక్తిగానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
‘హామీ’ ఇచ్చినందుకే ‘పదవుల’ ముచ్చట..
టీఆర్ఎస్ లో చేరిన తనకు పార్టీ అధిష్ఠానం ఎన్నోసార్లు హామీలు ఇచ్చి నెరవేర్చలేదనే అసంతృప్తి పొంగులేటికి, ఆయన వర్గీయులకు ఎప్పటి నుంచే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఒకవేళ పార్టీ మారితే భారీ కుదుపు తప్పదని భావించిన టీఆర్ఎస్ అధిష్థానం పొంగులేటికి ఈసారి కచ్చితమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు పదవి కట్టబెట్టి భద్రాద్రి జిల్లా బాధ్యతలు కూడా అప్పజెప్పాలని గులాబీ పెద్దల మైండ్ లో ఉన్నట్లు పొంగులేటి వర్గీయులు చర్చించుకుంటున్నారు. హామీ ఉందికాబట్టే పొంగులేటి అంత ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది.
బీజేపీలోకి వెళ్తాననడంలో వాస్తవం లేదు: పొంగులేటి
టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుండబద్ధలు కొట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బీజేపీలోకి వెళ్తాననడంలో వాస్తవం లేదన్నారు. పార్టీ పెద్దలు చెప్పినా కొందరు ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదనతో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికే ఆదివారం అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. స్థానిక నేతలు, కార్యకర్తల సమస్యలపై మాత్రమే మాట్లాడానని సమస్యలను అధిష్టానం దృష్టికి గతంలోనే తీసుకెళ్లానని చెప్పారు. పార్టీలో చిన్న సమస్యలున్నా అన్నీ సర్దుకుంటాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ప్రాధాన్యం సంతరించుకున్న అజయ్, తుమ్మల భేటీ
అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నేపథ్యంలో దమ్మపేటలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తన ఇంటి వద్ద కలిశారు. అయితే ఆదివారం పొంగులేటి చేసిన కామెంట్స్ దృష్ట్యా సోమవారం తుమ్మల, అజయ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కూడా అనేక ఊహాగానాలు రేకెత్తాయి.. అయితే కేవలం నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలోనే మర్యాద పూర్వకంగా మంత్రి అజయ్ వెళ్లి తుమ్మలను కలిసినట్లు తెలుస్తోంది.
మంత్రికి, పొంగులేటికి కేటీఆర్ నుంచి పిలుపు?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల వెనుకున్న కారణాలు, ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై ప్రభుత్వవర్గాలు ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులను తీసుకుని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ రెండు పరిణామాలతో ఖంగుతిన్న పార్టీ వర్గాలు వెంటనే అలర్ట్ అయ్యాయి. మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. పొంగులేటి, పువ్వాడతో పాటు ముఖ్య నేతలందరినీ వెంటనే రాజధానికి రావాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.