పోలీసుల కూంబింగ్ : భాస్కర్ వ్యూహం ఇదేనా?

by  |
పోలీసుల కూంబింగ్ : భాస్కర్ వ్యూహం ఇదేనా?
X

దిశ, వెబ్ డెస్క్: మావోల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు ఆపరేషన్ నిఘా పేరుతో ఆసిఫాబాద్ లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ కోసం చేపట్టిన వేట ముమ్మరంగా సాగుతోంది. కడంబ ఎన్‌కౌంట‌ర్‌ లో భాస్కర్ తృటిలో తప్పించుకోవడంతో అతని కోసం సమీపంలోని అడవులను రెండోరోజు కూడా జల్లెడ పడుతున్నారు పోలీసులు.

అతని కోసం జిల్లా సరిహద్దుల్లో, జడ్చర్ల, తుమ్మిడిహట్టి, కదంబ, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్ లో పెద్ద ఎత్తున సివిల్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీలు, గ్రేహౌండ్ దళాలు పాల్గొన్నాయి. ఇవాళ్టి నుండి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోవాలని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునివ్వడంతో ఉత్కంఠ నెలకొంది.

భాస్కర్ వ్యూహం ఏంటి?

మావోయిస్టులు నిరంతరం స్థావరాలు మారుస్తారు కానీ.. ఆసిఫాబాద్ అడవుల్లో సివిల్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీలు, గ్రేహౌండ్స్ దళాలు తనను పట్టుకునేందుకు సంచరిస్తున్నా… భాస్కర్ అక్కడే ఎందుకు తచ్చాడుతున్నాడు అనేదానిపై పోలీసులకు కొంత సమాచారం అందింది. తెలంగాణలో తిరిగి పూర్వ వైభవం సంపాదించేందుకు తపిస్తున్న మావోయిస్టులు ఆసిఫాబాద్ నుంచి రిక్రూట్‌మెంట్‌ చేసుకునేందుకు భారీగా సన్నాహాలు చేశారు. ఇందులో కొంతమేర సఫలీకృతం అయ్యారన్న అనుమానాలున్నాయి.

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కోటేశ్వరరావు ఆదేశాల మేరకు… మాజీ సానుభూతిపరులను, ఇన్ఫార్మర్లనుఅడెల్లు కలుస్తున్నట్టు సమాచారం అందుతోంది. తిర్యాణిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీసులకు లభించిన డైరీలో ఉన్న 15 మంది పేర్లు సానుభూతిపరులవా? రిక్రూట్ అయినవారివా అనే విషయంలో పోలీసులకు ఇంకా స్పష్టత లేదు. ఆ జాబితాలో కొందరు అనుమానితులను గుర్తించిన పోలీసులు, వారిపై కేసులు నమోదు చేశారు. మిగిలినవారి కోసం వేట కొనసాగుతోంది.

జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే.. భాస్కర్ లాక్‌డౌన్ సమయంలో స్థానికంగా పలువురిని రిక్రూట్ చేసుకున్నాడని, పాత సానుభూతిపరులతో తిరిగి పరిచయాలను పెంచుకున్నాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు నుండి కాగ‌జ్‌న‌గ‌ర్‌ వరకు భాస్కర్ దళం దాదాపు 40 కిలోమీటర్లు లోనికి వచ్చి స్వేచ్ఛగా సంచరించడం వెనక స్థానికుల సహకారం ఉండొచ్చని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.

జులై 12వ తేదీన మొదట తిర్యాణిలో జరిగిన ఎదురుకాల్పుల్లో అడెల్లు తప్పించుకున్నాడు. జైనూరులో స్థానికుల సాయంతో రెండోసారి కూడా ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు కడంబ ఎన్‌కౌంట‌ర్ లో మూడోసారి కూడా పారిపోయాడని పోలీసులు వివరించారు. మైదానంలోకి వెళితే డ్రోన్ కెమెరాలకు చిక్కే ప్రమాదం ఉండటంతో దట్టమైన అడవుల్లోకి వెళ్లాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల వేట ముమ్మరమైన ప్రతిసారీ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో భాస్కర్ తలదాచుకుంటున్నాడని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed