ప్రపంచంలో మరో కొత్త పొల్యూషన్.. చెల్లించక తప్పదు భారీ మూల్యం

by Shyam |   ( Updated:2021-07-23 00:22:05.0  )
ప్రపంచంలో మరో కొత్త పొల్యూషన్.. చెల్లించక తప్పదు భారీ మూల్యం
X

దిశ, ఫీచర్స్ : చిమ్మచీకటిని తరిమేసే వెలుగురేఖల్ని ‘రవి కిరణం’ మోసుకురావడం సహజం. కానీ థామస్ అల్వా ఎడిసన్ నిరంతరం కాంతులు విరజిమ్మే ‘బల్బు’ను కనిపెట్టి రాత్రికి కూడా ప్రకాశాన్ని తీసుకొచ్చాడు. అది సంతోషమే కానీ.. అతి ఏదైనా ప్రమాదమేనన్న విషయాన్ని మరిచిపోతోంది నేటి సమాజం. పండగలు, పెళ్లిల్లు, జాతరలు, వేడుకలు అంటూ బంగ్లాలు, వీధుల్ని జిగేల్ జిగేల్ లైట్లతో నింపేస్తున్నాం. ఇన్నాళ్లు భూమి, గాలి, నీరు కాలుష్యాలకు భయపడుతున్న మనం కాంతి కాలుష్యానికి కూడా కారణం కాగా.. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం. ఇక లైట్ పొల్యూషన్ వల్ల ఇప్పటికే లక్షల సంఖ్యలో పక్షులు ప్రాణాలు విడుస్తుండటంతో పలు దేశాల్లో ‘స్విచ్ఛాఫ్ లైట్స్ ఎట్ నైట్’‌ తెరమీదకు వచ్చింది.

పక్షులు.. సూర్యుడు, నక్షత్ర గమనాల ఆధారంగా సముద్రాలు, ఎడారులు, ఖండాలు దాటుకుంటూ వలస వెళ్తాయి. అయితే వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో వీధిలైట్లను అనుసరించడం వల్ల భవనాలను, ఇతర వస్తువులను ఢీకొట్టి మరణిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫిలడెల్ఫియాలో వేలాది పక్షులు చనిపోవడంతో ఆడుబోన్ సొసైటీ, అకాడమీ ఆఫ్ నేచురల్ సైన్సెస్(డ్రేక్సెల్ విశ్వవిద్యాలయం) సంయుక్తంగా ‘లైట్స్ అవుట్ ఫిల్లీ’ను ఇటీవలే ప్రకటించాయి. ఈ మేరకు పక్షులు వలస వెళ్లే కాలాల్లో నగరమంతటా అర్ధరాత్రి నుంచి ఉదయం 6 వరకు లైట్లు స్విచ్చాఫ్ చేయనున్నారు. ఇక యూఎస్‌లోని కాంతి కాలుష్యం కారణంగా ప్రతి ఏటా 100 మిలియన్ల నుంచి ఒక బిలియన్ పక్షులు చనిపోతున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు విద్యుత్‌ దీపాల వల్ల కీటకాల సంఖ్య కూడా తగ్గిపోతోంది. వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి కీటకాల్లో ఉన్నా, కాంతి కాలుష్యంతో ప్రాణాలు విడుస్తున్నాయి. కీటక జాతుల్లో సగం నిశాచర ప్రాణులే కావడంతో చంద్రుడి వెలుగుగా భ్రమపడుతూ బల్బుల చుట్టూ చేరి రెక్కలు ఆడిస్తూ అలసిపోయి చనిపోతున్నాయి.

జీవుల మనుగడపై ప్రభావం

ప్రపంచానికి సూర్యుడు ఓ ప్రాథమిక గడియారం కాగా.. మొక్కలు, పక్షులు, కీటకాలకు సంబంధించిన అన్ని సహజ ప్రక్రియలకు సంకేతాలు అందిస్తాడు. అయితే మానవులు కృత్రిమ కాంతితో వాటి నేచరల్ సైకిల్ ఆర్డర్‌ను దెబ్బతీస్తున్నారని సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు వెలుతురు వల్ల పంటల దిగుబడి తగ్గుతూ.. రాత్రి సమయాల్లో మొక్కల్లో పరపరాగ సంపర్కానికి సాయపడే కీటకాల్లోని చురుకుదనం తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. అలాగే చేపల పునరుత్పత్తికి, తాబేళ్ల నెస్టింగ్ బిహేవియర్‌కు భంగం కలిగించడంతో పాటు వాటిని సముద్రానికి దూరం చేస్తోంది. దాంతో అవి నీటి వద్దకు చేరేలోపు చనిపోతున్నాయి. నగరం ప్రకాశవంతమైన వెలుగుల్లో గబ్బిలాలు ఎటూ కదలడం లేదు. కాంతి కాలుష్యం వల్ల పగడపు దిబ్బలు కూడా దెబ్బతింటున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ క్రమంలోనే మానవులకు కూడా కాంతి కాలుష్య ప్రభావం వల్ల ముప్పు పొంచి ఉందని, మిరుమిట్లు గొలిపే కాంతి వల్ల జీవుల్లో చూపు మందగిస్తుందంటున్నారు. అలాగే నిద్రను ప్రేరేపించే హార్మోన్ ‘మెలటోనిన్’ ఉత్పత్తిపై చెడు ప్రభావం చూపుతోందని, ప్రపంచంలోని 80% కంటే ఎక్కువ మంది కాంతి కాలుష్య ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి.

‘కాంతి కాలుష్య’ చట్టాలు

స్లోవేనియా 2007లో కాంతి కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక జాతీయ చట్టాన్ని ఆమోదించింది. వీధుల్లోని లైటింగ్ ఓ స్థాయికి మించి ప్రకాశాన్ని ప్రసరించకూడదని పేర్కొంది. అలాగే ప్యూర్టో‌రికో 2008లో కాలుష్య చట్టాన్ని ఆమోదించింది. 2019లో ఫ్రాన్స్ బహిరంగ లైటింగ్‌పై చట్టాలను ప్రవేశపెట్టగా, దాని వల్ల 6% కాంతి కాలుష్యం తగ్గింది. అదే సంవత్సరం క్రొయేషియా లైటింగ్ స్థాయిలను పరిమితం చేసే చట్టాన్ని ఆమోదించింది. 17 యూఎస్ రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కొన్ని రకాల కాంతి కాలుష్య చట్టాలను కలిగి ఉన్నాయి. యూకేలోని రాజకీయ నాయకులు ‘నీలాకాశ’(బ్లాక్ స్కైస్) రక్షణ కోసం ఒక పార్లమెంటరీ సమూహాన్ని ఏర్పాటు చేసి ఓ ప్రణాళిక విడుదల చేశారు.

స్విచ్చాఫ్ చేస్తేనే మేలు!

‘కృత్రిమ కాంతి జీవులన్నింటికీ హానికరమే. రాత్రిపూట ఈ కాంతి వల్ల డయాబెటిస్, మూడ్ డిజార్డర్స్, రొమ్ము, ప్రోస్టేట్‌తో పాటు ఇతర క్యాన్సర్లు వచ్చే ప్రమాదముంది. అయితే సమస్య సంక్లిష్టంగా ఉన్నా.. లైట్లను వీలైనంత ఆర్పివేయడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. కర్బన ఉద్గారాలు తగ్గి జీవకోటికి మేలు కలుగుతుంది. ఆధునిక జీవితంలో లైటింగ్ ఓ అవసరంగా మారిపోగా, దాన్ని బాధ్యతాయుతంగా, తెలివిగా ఉపయోగించుకుంటే అందరికీ మంచిది. చీకటి చెడుకు సంకేతంగా సమాజం భావిస్తుంది కానీ.. అనవసరమైన వెలుగులే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ప్రజలు గ్రహించాలి. – రస్కిన్ హార్ట్లీ, ఇంటర్నేషనల్ డార్క్-స్కై అసోసియేషన్ (IDA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

19 వ శతాబ్దం చివర్లో ప్రారంభమైన ఎలక్ట్రిక్ లైటింగ్ యుగం.. రానురాను వెలిగిపోతోంది. కొత్త టెక్నాలజీ వెలుతుర్లు 150 మైళ్ళ వరకు విస్తరిస్తాయని అంచనా. మానవాళికి చీకటితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అందువల్లే కోటానుకోట్ల సంఖ్యలో మెరిసే నక్షత్రాలు కనిపించడం లేదు. అనవసర కాంతుల నుంచి పర్యావరణాన్ని, జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed