పినపాకలో ఏం జరుగుతోంది..?

by Sridhar Babu |   ( Updated:2021-12-16 10:12:34.0  )
పినపాకలో ఏం జరుగుతోంది..?
X

దిశ, మణుగూరు : రాజకీయ నాయకుల తీరు వలన పినపాక నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 2023 చివర్లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే నియోజకవర్గంలో మాజీ, తాజా లీడర్లు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ నాయకులు వరుసగా ప్రచారాలు చేస్తుండటంతో ప్రజలకు కూడా ఏం తోచడం లేదని సమాచారం. ఏడాది తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది.

ఇంటింటికీ కేసీఆర్.. కష్టపడుతోన్న రేగా..

ఇంటింటికీ కేసీఆర్.. గ్రామగ్రామానికి టీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా రేగా కాంతారావు నియోజకవర్గంలో బిజీ బిజీ అయిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు
ఇంటింటికీ కేసీఆర్.. గ్రామగ్రామానికి టీఆర్ఎస్ కార్యక్రమాన్ని చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో రోజూ పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. గడపగడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ తమకు అండగా ఉంటుందని చెబుతున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రతీ గడప సమస్య.. నా సమస్యగా భావించి రేగా ప్రజల మధ్యలో తిరుగుతూ మండల, పంచాయతీల పరిధిలోని సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. కొన్ని మండలాల మహిళలు రేగాకు హారతులు పట్టి దీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల కుటుంబాలను సైతం పరామర్శించి అనారోగ్యంతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రేగా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. ప్రతీ వ్యక్తితో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. మీకు అండగా ఉంటానని వారికి భరోసా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, రేగా నియోజకవర్గ ప్రజల కోసం పని చేశారని కొందరు, చేయలేదని మరికొందరు చెప్పుకుంటున్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారా? లేదా అని ఇప్పటి నుంచే జోరుగా చర్చ నడుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే పాయం కూడా బిజీబిజీ..

దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలని పెద్దలు చెప్పిన మాటను పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరిచారు. ఆయన తీరు నచ్చకే గత ఎన్నికల్లో రేగా కాంతారావుకు పినపాక ప్రజలు పట్టం కట్టారన్నది కాదనలేని సత్యం.. అయితే, మనిషి తన జీవితంలో తప్పులు చేస్తుంటారని వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ జీవితం ఉంటుందని కొందరు అంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదని పాయం.. ప్రస్తుతం నియోజకవర్గంలో జరిగే ప్రతీ పెళ్లి, ఫంక్షన్స్‌కు హాజరవుతున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే, అధికార పార్టీలో ఉన్న పాయం.. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారా? లేక వచ్చే ఎన్నికల్లో మరో పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రజలకు హింట్ ఇస్తున్నారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారని కాదు కాదు కాంగ్రెస్‌లో చేరుతున్నారని జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. పొంగులేటి ఎటు వెళ్తే పాయం కూడా ఆయనతోనే అన్న టాక్ కూడా వినబడుతోంది. రోజుల కిందట పాయం.. ములుగు ఎమ్మెల్యే సీతక్క, భట్టి విక్రమార్కను కలిశారని కొంత విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా 2023లో జరిగే ఎన్నికల్లో పినపాక ప్రజలు రేగా వైపు నిలుస్తారా? పాయం వైపు నిలుస్తారా? అన్నది తెలియాల్సిఉంది.

రంగంలోకి ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు..

ములుగు ఎమ్మెల్యే సీతక్క పినపాకలో జెండా పాతబోతుందని ఆమె కుమారుడు సూర్య ద్వారా నియోజకవర్గ ప్రజలకు సమాచారం ఉందని తెలుస్తోంది. సీతక్క కొడుకు సూర్య భూర్గంపాహాడ్ మండలంలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సీతక్క కుమారుడు అని తెలుసుకున్న ప్రజలు ఆయన చుట్టూ చేరి తమ బాధలను చెప్పుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల కిందట గుండాల., ఆళ్లపల్లి మండలాలకు కూడా వెళ్లారని సమాచారం. అక్కడ కూడా ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారని తెలుస్తోంది. సీతక్క కావాలనే తన కొడుకును పినపాకకు పంపించి కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రజలకు గుర్తుచేసేలా చేస్తుందని టాక్.. పినపాకలో గతం నుంచే కాంగ్రెస్ పార్టీకి మంచి కేడర్ ఉంది. ఇప్పుడు సీతక్క అక్కడ ఎంట్రీ ఇస్తే ఇటు రేగా, అటు పాయం ఇద్దరి పని ఔట్ అంటూ జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి. కాగా, 2023 ఎన్నికల్లో ఈ ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ ఉండగా ప్రజలు ఎవరికీ పట్టం కడుతారో వేచిచూడాల్సిందే..

Advertisement

Next Story

Most Viewed