ఎండాకాలంలో అందంగా కనిపించాలంటే.. ఈ ఫ్రూట్స్ తినాల్సిందే..!

మండుతున్న ఎండల వల్ల శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు వస్తుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ సీజన్ లో కొన్ని పండ్లను తింటే మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా మెరుస్తుంది.
ఎండాకాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్. ఇందుకు ప్రతిరోజూ పుష్కలంగా నీటిని తాగాలి.
ఈ సీజన్‌లో శరీరాన్ని చల్లబరచడానికి పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగాలి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఏఏ పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
పైనాపిల్‌లో ‘బ్రోమ్లిన్’ అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వేసవిలో పుచ్చకాయను కచ్చితంగా తినాలి. ఈ పండు దాహాన్ని తీర్చడమే కాదు శరీరానికి పోషణను, మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
బెర్రీలు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, కోరిందకాయలు వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
మామిడి పండ్లలో విటమిన్ ఎ, బి6, సి లతో పాటుగా పొటాషియం, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కివీస్‌లో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె, సి అధికంగా ఉన్న వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బొప్పాయిలో విటమిన్ సి, ఎ, బి ఎక్కువగా ఉంటాయి. 91-92% వాటర్ కంటెంట్ ఉంటుంది. మినరల్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్దకాన్ని నివారించడానికి, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, చర్మ సంరక్షణకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది.