ఈ కషాయం తాగితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్యాల బారిన పడతారు.
వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. నిజానికి, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారడం వల్ల అనారోగ్యాలు వచ్చే ముప్పు పెరుగుతుంది.
అయితే.. సీజనల్లీ వచ్చే రోగాల నుంచి ఉపశమనం పొందేందుకు పదేపదే మెడిసిన్ వాడుతుంటారు. దీంతో అంతర్గత అవయవాలు దెబ్బతినడమే కాకుండా.. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
కాబట్టి.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గించుకునేందుకు ఆయుర్వేద చికిత్స ఎంతో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణురాలు దీక్షా భావ్‌సర్‌ అన్నారు. అవేంటో తెలుసుకుందాం.
శొంఠి (అల్లం): అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసుకున్న మిశ్రమాన్నే శొంఠి అంటారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శొంఠిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండి.. శరీరంలో ఇన్‌ఫెక్షన్ తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శొంఠి నీళ్లు తాగితే.. జలుబు, దగ్గు దూరమవుతాయి. కఫాన్ని తగ్గించి మీ గొంతును క్లియర్‌ చేస్తుంది.
పసుపులో విటమిన్లు, మినరల్స్‌, మాంగనీస్‌, ఐరన్‌, ఫైబర్‌, విటమిన్‌ బి6, కాపర్‌, పొటాషియం వంటి పోషకాలుతో పాటు.. యాంటీసెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌, యాంటీఫంగల్‌ గుణాలు ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తాయి. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబు, దగ్గు లాంటివి తగ్గుముఖం పడతాయి.
అంతే కాకుండా.. గ్లాసు నీళ్లల్లో కొన్ని తులసి ఆకులు, కొన్ని పుదీనా ఆకులు, 1 స్పూన్ శొంఠి పొడి, అర టీ స్పూన్‌ పసుపు వేసుకుని.. 7 నుంచి 10 నిమిషాల పాటు ఈ నీటిని మరగనివ్వండి. పూర్తిగా చల్లారకుండా ఈ కషాయాన్ని గోరువెచ్చగా తాగితే.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.
నోట్: పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్, ఆయుర్వేద నిపుణులు ద్వారా ఇచ్చినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చిన డాక్టర్లను సంప్రదించడం మంచిది.