మెడ నుంచి తల వెనుక వరకు నొప్పిగా ఉందా.. అయితే మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా..?

సాధారణంగా చాలా మందికి మెడ వెనుక బాగంలో నొప్పిగా ఉంటుంది. ఇది తలలో నొప్పి తీవ్రతను కూడా పెంచుతుంది.
ఆ సమయంలో మెడ కానీ, తల కానీ ఎటూ తిప్పలేము. విపరీతమైన నొప్పి వస్తుంది. దీనిని చాలా మంది మైగ్రేన్ అని భయపడతారు.
కానీ.. నిజానికి ఈ నొప్పిని సర్వైకోజెనిక్ హెడ్ ఏక్ అని అంటారంట. అసలు సర్వైకోజెనిక్ హెడ్ ఏక్ అంటే ఏమిటీ.. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం.
సర్వైకోజెనిక్ హెడ్ ఏక్‌ గురించి బెంగుళూరులోని రిచ్‌మండ్ రోడ్‌లో ఉన్న ఫోర్టిస్ హాస్పిటల్‌లో ట్రామా, ఆర్థోపెడిక్స్ హెచ్‌వోడీ, ఎంబీబీఎస్, ఎమ్‌ఆర్‌సీఎస్, డిప్లొమా ఇన్ సికోట్ ఎఫ్ఆర్‌సీఎస్ ఆర్థో(బ్రిటన్) డాక్టర్ సాయి క్రిష్ణ బి నాయుడు తెలిపిన దాని ప్రకారం..
కొన్ని మెడ కండరాలు తల వెనుక భాగంతో అనుబంధమై ఉంటాయి. మెడ నరాల్లో ఒత్తిడి కలిగినప్పుడు మెడను రక్షించడానికి మెడ కండరాలు బిగుతుగా మారతాయి.
ఈ కండరాలు తలలోకి ఉండటంతో అవి బిగుతుగా మారినప్పుడు తల సైతం నొప్పిగా మారుతుంది. దీంతో తల వెనుక బాగంలో ఒక వైపు నొప్పి వస్తుంది. దీనినే సర్వైకోజెనిక్ హెడ్ ఏక్ అంటారు.
మెడ బెనకడం, ఆర్థరైటిస్ సమస్యలు ఈ నొప్పికి దారితీస్తాయి. కంప్యూటర్ ముందు కొన్ని గంటల పాటు కూర్చోవడం, భంగిమ సరిగా లేకపోవడం వంటివి కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం.
సర్వైకోజెనిక్ హెడ్ ఏక్ అంటే మెడను కదిపేటప్పుడు నొప్పి కలడం, వికారం, వాంతులు, కళ్ల చుట్టూ నొప్పి వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.
తలలో ఒక వైపు మాత్రమే నొప్పి కలగడం, పైకి, కిందకి ఈ నొప్పి జారుతుండటం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు తలలో నొప్పి కలగడం, మెడను అటు, ఇటు కదిపేందుకు వీలు లేకుండా నొప్పి రావడం వంటివి ఏర్పడతాయి. మైగ్రేన్, సర్వైకోజెనిక్ హెడ్‌ఏక్ వేర్వేరు అయినప్పటికీ కొన్ని ఉమ్మడి లక్షణాలు కూడా ఉన్నాయి.
అయితే వీటిని నివారించేందుకు వైద్యులను సంప్రదించడం మంచిది. స్పెషలిస్టులు మాత్రమే దీనిని నిర్ధారించగలరు. స్కానింగ్‌లు, ఇతర పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. సమస్యను సరిగా విశ్లేషిస్తేనే మెరుగైన చికిత్స అందించేందుకు అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు దీనికి మందులు కూడా ఉపయోగించాల్సి ఉంటుంది.