మీ ఇంట్లో సాలెపురుగు ఉందా.. అయితే మీరు అదృష్టవంతులేనట..?
సాధారణంగా ప్రతి ఇంట్లో సాలెపురుగులు ఉంటాయి. అయితే వాటి కారణంగా ఏమైనా ప్రమాదమా అని చాలా మంది బయపడుతుంటారు.
సాలెపురుగు ఇంట్లో ఉందంటే దరిద్ర దేవత ఉన్నట్లో అని కొందరు అభిప్రాయపడతారు. కానీ.. సాలెపురుగు వల్ల అనేక ప్రయోజలున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అవి ఏంటంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాలెపురుగులు సహజమైన పెస్ట్ కంట్రోల్‌లా పనిచేస్తాయట. అవి మనుషులకు హానికరమైన ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి అనేక రకాల పురుగులను ఆహారంగా తింటూ.. మానువునికి మేలు చేస్తున్నాయి.
పర్యావరణం బాగుండాలంటే సాలెపురుగుల సంఖ్య పెరగాలట. ఎందుకంటే.. చెట్లు, సాలెపురుగుల మధ్య బంధాన్ని తాను కనుక్కున్నామని మేరీల్యాండ్ యూనివర్శిటీలో దీనిపై అధ్యయనం చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కరిన్ బర్గార్డ్ తెలిపారు.
అధ్యయనం ప్రకారం.. సాలెపురుగులు దట్టంగా ఉండే చెట్ల దగ్గర ఉంటాయి. కాబట్టి అలాంటి గుబురు చెట్లను పెంచడం ద్వారా సాలీళ్ల సంఖ్య పెరిగి.. సహజమైన తెగులు నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు.
పరిశోధకులు మేరీల్యాండ్‌లోని 75 స్థలాల్లో 16 చెట్ల జాతుల్ని నాటారు. వీటిలో రెడ్ మాపుల్, వైట్ ఓక్, బ్లాక్ గమ్ చెట్లు ఉన్నాయి. 2019 నుంచి 2021 వరకు, శాస్త్రవేత్తలు ప్రతి చెట్టు నుంచి సాలెపురుగుల సంఖ్యను పదేపదే లెక్కించారు.
ఒకే చోట రకరకాల చెట్లు ఉన్న చోట సాలీళ్ల జనాభా ఎక్కువగా ఉందని పరిశోధనా బృందం కనుక్కుంది. "ఒకే రకమైన చెట్ల కంటే.. రకరకాల చెట్లు ఒకే చోట ఉంటే.. సాలీళ్లు గూళ్లు అల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పెద్ద గూళ్లు అల్లుకుంటాయి" అని ఈ బృందం తెలిపింది.
ఎండాకాలంలో సాలెపురుగులు చురుకుగా ఉంటాయి. అందువల్ల అవి ఎక్కువ సంఖ్యలో కీటకాల్ని తింటాయి. దీంతో వేసవిలో పురుగు మందుల వాడకాన్ని అవి తగ్గిస్తున్నాయి అని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రపంచ దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అందువల్ల తెగుళ్ల కీటకాలు, దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వాటి సంఖ్యను తగ్గించేందుకు సాలీళ్ల వంటి వాటిని పెంచాలి. తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది అని పరిశోధకులు చెబుతున్నారు.