గోవా ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా.. కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ ప్రదేశాలు ఇవే!!

వేసవితో పిల్లలకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి కాబట్టి చాలా మంది ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటుంటారు. దానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఆలోచనలో పడతారు.
మీరు సమ్మర్ వేకేషన్‌కు వెళ్లాలి అనుకుంటే గోవాలోని ఈ ప్రదేశాలను ఎంపిక చేసుకోవడం మంచిది. వీటిని చూస్తే కచ్చితంగా అద్భుతమైన, ఎప్పటికీ గుర్తుపెట్టుకునే అనుభూతిని పొందడం ఖాయం.
కొంత మంది సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని చూసి అనుభూతిని పొందాలనుకుంటారు. అలా పొందాలి అనుకుంటే కలాంగుట్ బీచ్ గోవాలో అత్యంత ప్రసిద్ధమైన బీచ్‌ను చూడాల్సిందే. సూర్యోదయం, సూర్యాస్తమయం అద్భుతంగా కనిపించి కనువిందు చేయటంలో ఇది అనువైన ప్రదేశం.
ప్రపంచంలోని అత్యుత్తమ చర్చిలు, పురాతన మ్యూజీయాలు పాత గోవాలో ఉన్నాయి. ఇవి ఒకప్పటి గోవా వారసత్వాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాయి.
గోవాలో సింక్వెరిమ్ బీచ్‌లోని 17వ శతాబ్దపు కోట ఉంది. ప్రస్తుతం ఇది పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుని పర్యాటకులను ఆకర్శిస్తోంది.
ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశం దూద్‌సగర్ జలపాతాలు. ఇవి 320 మీటర్ల ఎత్తు నుండి కిందకు ప్రవహించడంతో పాటు చుట్టూ ఉన్న పచ్చని అడవి కనువిందు చేస్తుంది.
గోవా రాజధాని అయిన పనాజీ సిటీ పోర్చుగీస్ సంస్కృతులకు ప్రత్యేకం. ఇక్కడ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చి, మేరీ చర్చి ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి.
గోవాలో అంజునా ఫ్రీ మార్కెట్ ప్రదేశంలో ఓ ప్రత్యేకమైన ప్రదర్శన శాల ఉంటుంది. అందులో చేతులతో తయారుచేసిన బట్టలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వరకు అన్నిటీని చూడటంతో పాటు నచ్చినవి కొనుగోలు కూడా చేసుకోవచ్చు.
అలాగే మోర్జిమ్ బీచ్‌లో స్వచ్ఛమైన నీరు, మృదువైన ఇసుక ఉండి మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. అంతేకాకుండా అంతరించిపోతున్న అనేక రకాల తాబేళ్లను ఇక్కడ చూడవచ్చు.
చపోరా కోట దాని ప్రత్యేక నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఫొటో షూట్లు చేసుకోవడానికి కూడా ఇది అనువైన ప్రదేశం. కాబట్టి ఫ్యామిలీతో వెళ్లి అందమైన ఫొటోలను తీసుకుని మర్చిపోలేని జ్ఞాపకాలుగా మార్చుకోండి.
సే కేథడ్రల్ చర్చి అద్భుతమైన పోర్చుగీస్ వాస్తుకళతో తెలియజేయడంలో ప్రసిద్ధిగాంచినది. మనసును కదిలించే అనేకమైన పెయింటింగ్‌లు, అద్భుతమైన శిల్పాలు ఇక్కడ ఉంటాయి.
గోవాకు దక్షిణాన కర్ణాటక సరిహద్దులో పురాతన శివాలయం ఉంది. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పూర్తిగా నల్ల రాతితో నిర్మించారు. దీనిని మహాదేవ ఆలయంగా పిలుస్తారు. అలాగే ఆలయం చుట్టూ పర్వతాలు పచ్చని చెట్లు ఉండి మంచి అనుభూతిని కలిగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.