‘భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాం’

by Shamantha N |
‘భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాం’
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సూచించిన కొంతమంది ట్విట్టర్ ఖాతాలను నిలిపేశామని, మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, పొలిటీషియన్లకు చెందిన కొన్ని ఖాతాలపై ఆంక్షలు విధించలేదని ట్విట్టర్ సంస్థ వెల్లడించింది. ట్రాక్టర్ పరేడ్ హింసకు సంబంధించి కొందరు రెచ్చగొడుతూ ట్వీట్లు చేశారని, వారి ఖాతాలను నిలిపేయాలని లేదా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ సంస్థకు నోటీసులు పంపింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచించిన కొన్ని ఖాతాలను నిలిపేశామని బుధవారం ట్విట్టర్ వెల్లడించింది. కానీ, కేంద్రం సూచించిన ఆదేశాలు భారత చట్టాలకు లోబడి లేవన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కొందరు మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, యాక్టివిస్టులు, పొలిటీషియన్ల ఖాతాలపై చర్యలు తీసుకోలేదని తెలిపింది. అలాగే, భావప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి ఉండటం, వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాలనే సొంత నియమాలకు అనుగుణంగా వీరి ఖాతాలను రద్దు చేయలేదని వివరించింది.

ట్విట్టర్ స్పందనపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ట్విట్టర్ ఖాతాల నిలుపుదల ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశానికి ట్విట్టర్ అభ్యర్థించిందని, ఇందుకు ప్రభుత్వమూ సుముఖతనే వ్యక్తం చేసిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. కానీ, భేటీకి ముందే ట్విట్టర్ తన అభిప్రాయాలను బహిర్గతం చేయడం అసాధారణ చర్య అని అభిప్రాయపడింది. దీనిపై త్వరలోనే స్పందిస్తామనీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పలుసార్లు పూర్తిస్థాయిలో అమలు చేయని నేపథ్యంలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌కు ప్రత్యామ్నాయంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కూ’ను ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ‘కూ’ యాప్ డౌన్‌లోడ్లు అసాధారణంగా పెరిగడం గమనార్హం.

Advertisement

Next Story