కంగనాకు భద్రత కల్పిస్తాం :హిమాచల్ ప్రదేశ్

దిశ వెబ్‎డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భద్రత కల్పించేందుకు ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ ముందుకొచ్చింది. కంగనా తమ రాష్ట్ర కూతురు అని.. ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ హామీ ఇచ్చారు. ఇక్కడే కాదు, ఆమె ముంబై వెళ్లినా భద్రత కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఇటీవల శివసేన నాయకుడు సంజయ్ రౌత్‎తో మాటల యుద్దం సాగిన నేపథ్యంలో తన కుమార్తెకు భద్రత కల్పించాలంటూ కంగనా తండ్రి లేఖ రాసినట్లు సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. కంగనాకు భద్రతపరమైన ముప్పు అంచనా వేసిన అనంతరం మనలిలోని ఆమె ఇంటి వద్ద భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కంగనాకు ‘వై’ భద్రత కల్పించేందుకు కేంద్రహోం శాఖ నిర్ణయించడంపై జైరాం ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement