సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం..

by Shamantha N |
సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం..
X

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా పోరాడతామని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత ఎంకె స్టాలిన్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేసేదాకా కేంద్రంతో పోరాడతామని అన్నారు. శ్రీలంకలో ఉన్న తమిళులకు పౌరసత్వం కల్పించాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. డీఎంకే మేనిఫెస్టోలోనూ ఇందుకు సంబంధించిన అంశాలను పొందుపరచడం గమనార్హం.

కాగా.. తమను గెలిపిస్తే చెన్నై-సేలం మధ్య నిర్మించతలపెట్టిన ఎక్స్‌ప్రెస్ హైవేను కూడా రద్దు చేస్తామని అన్నారు. ఇది వేలాది మంది రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నదని ఆయన ఆరోపించారు. 505 హామీలతో డీఎంకే శనివారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed