రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తాం

by Shyam |
Indrakaran Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని, ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి నియోజకర్గమైన నిర్మల్ జిల్లాలోని ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులపై సోమ‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో సమీక్ష నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని బాస‌ర‌ శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం, అడెల్లి పోచ‌మ్మ ఆలయం, కాల్వ శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి, కదిలి శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షలో చర్చించారు. వివిధ ఆల‌యాల్లో కొన‌సాగుతున్న ప‌నులు, త్వర‌లో చేప‌ట్టబోయే ప‌నుల‌కు సంబంధించి అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ద్వారా మంత్రికి వివ‌రించారు.

మంత్రి మాట్లాడుతూ ఆధ్మాత్మిక‌తోపాటు మాన‌సిక ఆహ్లాదం క‌లిగించేలా ఆల‌యాల ప‌రిసరాల‌ను తీర్చిదిద్దాల‌న్నారు. ఎకో టూరిజానికి క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నప్పటికీ టెంపుల్ టూరిజానికి కూడా భ‌క్తులు అత్యధిక ప్రాధాన్యత ఇసున్నారన్నారు. బాస‌ర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని ద‌ర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భ‌క్తులు వ‌స్తున్నార‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్ని స‌దుపాయాలు క‌ల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళిక‌లు రూపొందించాల‌ని అధికారులకు నిర్దేశించారు. ముఖ్యంగా భ‌క్తుల‌కు విడిది సౌక‌ర్యం, క్యూ కాంప్లెక్స్, తాగునీరు, షాపింగ్ కాంప్లెక్స్, త‌దిత‌ర సౌక‌ర్యాలు, న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని సుంద‌రీక‌రించ‌డంతో పాటు గోదావ‌రి న‌దికి హ‌ర‌తీనిచ్చే ప్రాంతాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దడం, బోటింగ్ కు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు.

బాస‌ర‌లో ఇప్పటికే రూ.8 కోట్లతో ఆల‌య అభివృద్ధి ప‌నులు వేగంగా జరుగుతున్నాయ‌న్నారు. బాస‌ర‌తో పాటు అడెల్లి, కాల్వ, క‌దిలి ఆల‌యాల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ శిల్పుల సహకారంతో డిజైన్లు రూపొందించి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అడెల్లి ఆల‌య విస్తర‌ణ ప‌నుల‌కు కావాల్సిన భూ సేక‌ర‌ణ‌కు త‌గిన ప్రతిపాద‌న‌లు రూపొందించి క‌లెక్టర్ కు అంద‌జేయాల‌న్నారు. పుణ్యస్నానాల‌కు ప్రత్యేకంగా ష‌వ‌ర్లు (నీటీ జ‌ల్లు స్నానం) ఏర్పాటు చేయాల‌ని, కోనేటిలో స్వచ్చమైన నీరు, భ‌క్తుల‌కు విడిది గృహాలు, వీఐపీ గెస్ట్ రూంలు, బ‌యో టాయ్లెట్స్ నిర్మించాల‌ని సూచించారు. కాల్వ దేవస్థానంలో కోనేటిని అభివృద్ధి ప‌ర‌చ‌డంతో పాటు భ‌క్తుల‌కు మ‌రిన్ని మెరుగైన సౌక‌ర్యాల క‌ల్పన‌కు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆల‌యాల్లో భ‌క్తుల‌కు క‌ల్పించే ప‌లు స‌దుపాయాల కోసం దాత‌లు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాల‌ని మంత్రి కోరారు. సమీక్షలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, స్తప‌తి శ్రీవ‌ల్లినాయ‌గం, సీఈ జి. సీతారాములు, బాస‌ర ఈవో వినోద్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story