ఉస్మానియా భూముల్ని పరిరక్షిస్తాం : మేయర్

by  |
ఉస్మానియా భూముల్ని పరిరక్షిస్తాం : మేయర్
X

దిశ, న్యూస్ బ్యూరో
చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ భూములను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. చట్టబద్దమైన హక్కులు లేనప్పటికీ 9మంది తప్పుడు పత్రాలను ఆధారంగా చూపుతూ నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు కోరినట్లు వివరించారు.అయితే ఉస్మానియా వర్శిటీకి చెందిన ఈ భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటిని పరిరక్షించడంపై మేయర్ దృష్టి సారించారు.ఈ భూముల వివరాలను తెలియజేస్తూ మేయర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాలరెడ్డి, వైస్ ఛాన్స్‌లర్ ఓఎస్‌డీ ప్రొఫెసర్ టి.కృష్ణారావులు విజ్ఞాపన పత్రం అందజేశారు.ఈ భూములు వర్శిటీకి చెందినందున వ్యక్తులుగా ఎవరు వచ్చి అనుమతులు కోరినా మంజూరు చేయవద్దని కోరారు.
భూములను కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చిన మేయర్, వెంటనే ఆ విషయాన్ని జీహెచ్ఎంసీ కమీషనర్‌ దృష్టికి తీసుకెళ్ళారు.యూనివర్శిటీకి ఆనుకుని ఉన్న డీడీ కాలనీలో తులసి కోపరేటింగ్ హోసింగ్ సోసైటీకి ఉస్మానియా యూనివర్సిటీకి మధ్య గతంలో స్థలం వివాదం ఏర్పడిందని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 4800 చదరపు గజాలస్థలాన్ని ఆ సొసైటీకి ఇవ్వక తప్పలేదని రిజిస్ట్రార్ వివరించారు. ఆ 4800 చ.గ. స్థలాన్ని సొసైటీ లే అవుట్ చేసి 13 మందికి విక్రయిoచిందని, ప్రస్తుతం ఆ స్థలాల్లో కొద్దిమంది ఇళ్ళు కట్టుకొని నివసిస్తున్నారని తెలిపారు. ఒక ప్లాట్‌ను పార్కుకు కేటాయించారని, అయితే తొమ్మిది మంది వ్యక్తులు అదే సోసైటీతో లాలూచీ అయ్యి తప్పుడు పత్రాలు సృష్టించి మరో 3,296 చ.గ. స్థలాన్ని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో వివరించారు.


Next Story

Most Viewed