- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సరికొత్త ఐడియాలు రావడానికి కొన్ని చిట్కాలు
దిశ, వెబ్‌డెస్క్: కొత్తొక వింత.. పాతొక రోత అని తెలుగులో ఒక సామెత ఉంది. అయితే ఈరోజుల్లో మాత్రం కొత్త కూడా ఒక రోతగానే మారిపోయింది. ఇప్పుడు కావాల్సింది కొత్తదనం కాదు సరికొత్తదనం. పాత ఐడియాలను కొత్త సీసాలో పోసి ఇస్తే ఈ కాలంలో వెంటనే కనిపెట్టేస్తున్నారు. అంతేగాకుండా ప్రతి నిమిషానికి ఏదైనా ఒక రంగంలో కానీ, పనిలో కానీ కొత్త అనే పదానికి అర్థం మారిపోతోంది. కంటెంట్ వినియోగానికి తగ్గట్లు ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలు రావాలంటే క్రియేటర్ చాలా తెలివైనవాడై అయ్యుండాలి. మరి ప్రతిరోజూ కొత్త ఐడియాలంటే కష్టమే..కానీ, కొద్దిగా కష్టపడితే ఐడియాల గనిగా మారే అవకాశం ఉంది. అలాగే ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా, యూట్యూబ్ కాలంలో ప్రతి ఒక్కరూ క్రియేటర్‌లే కాబట్టి కొత్త ఐడియాల అవసరం మరింత పెరిగింది. మరి ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలు రావాలంటే ఏం చేయాలనే విషయం గురించి మండే మోటివేషన్‌లో భాగంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా కొత్త ఐడియా ప్రాముఖ్యత ఏంటి? ఈరోజుల్లో కొత్త ఐడియాకు ఉన్న పవర్ ఏంటో చూద్దాం.
ఒక పుచ్చకాయను పండించే రైతు దాన్ని నేరుగా వినియోగదారుడికి అమ్మడం వల్ల అతనికి వచ్చే లాభం చాలా తక్కువ ఉంటుంది. అదే పుచ్చకాయతో జ్యూస్ చేసి, ముక్కలు చేసి, వాటి మీద కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి జల్లి అమ్మే వాడికి కొంచెం లాభం ఎక్కువగా ఉంటుంది. ఒక పుచ్చకాయను నేరుగా కాకుండా, ఇలా జ్యూస్ చేసి అమ్మాలని ఐడియాలు ఇచ్చే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌లకు మిగతా ఇద్దరి కంటే ఎక్కువ లాభం ఉంటుంది. అసలు ఈ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ చేసిన పని ఏం లేదు, కేవలం పరిస్థితులను గమనించి, వర్కవుట్ అయ్యే ఐడియాను చెప్పడమే. ఇదే రకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఏదీ వైరల్ అవుతుంది? ఏ వీడియో చేస్తే ట్రెండ్ అవుతుంది? ఎలా చేస్తే పాపులర్ అవుతుంది? అని ఐడియాలు ఇచ్చేవాళ్లకు కూడా డిమాండ్ పెరిగింది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏది వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. అంతకన్నా ముఖ్యంగా జనాలకు ఏదీ కావాలనే విషయం వారికే సరిగా తెలియదు. కానీ, కొత్త కంటెంట్ ఏదైనా వచ్చిందంటే మాత్రం దాన్ని వైరల్ చేయకుండా ఉండరు. మరి ఈ కొత్త అనేది క్రియేటర్‌కు ఎలా తెలుస్తుంది? ఒక ఐడియా వినూత్నంగా ఉన్నప్పుడు, లేదా అందరి కంటే భిన్నంగా చేయగలిగినప్పుడు దానికి కొత్త ఐడియా అని పేరు పెట్టొచ్చు. అయితే అన్ని కొత్త ఐడియాలు హిట్ అవ్వాలని రూల్ లేదు. అలాగని హిట్ అయిన ప్రతి కొత్త ఐడియాను అందరూ ఒకేవిధంగా కాపీ కొట్టడం సబబు కాదు. ఈమెయిల్ ఐడీ ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబర్‌గా మారుతున్న ఈరోజుల్లో క్వాలిటీ కంటెంట్ కంటే కాపీ కంటెంట్ బాగా పెరిగింది. మరి ఈ కంటెంట్ మహాసముద్రంలో మీ కొత్త ఐడియా వెలుగులు విరజిమ్మాలంటే ముందు అది ఆకట్టుకునేలా ఉండాలి. అన్ని ఐడియాలు ఆకట్టుకునేలా ఉండటం అసాధ్యం కాబట్టి మంచి ఐడియాలు రావడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.
చదవండి, చూడండి, వినండి, గమనించండి
ఐడియా ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఎక్కువగా పుస్తకాలు చదవడం, సినిమాలు, డాక్యుమెంటరీలు చూడటం, పాడ్‌కాస్ట్‌లు వినడం, చుట్టుపక్కల పరిస్థితులను అబ్జర్వ్ చేయడం ద్వారా కొత్త ఐడియాలు తడతాయి. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడమే కాకుండా ఇష్టంలేని పుస్తకాలనూ చదవాలి. అలా చదవడం వల్ల ఆ ఇష్టం లేని భాగాన్ని ఇష్టంగా ఎలా మార్చాలనే కొత్త ఐడియా వస్తుంది. సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంటరీల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు పాపులర్ అవుతున్నది ఏంటంటే..పాత కంటెంట్‌నే కొత్త రకంగా ప్రెజెంట్ చేయడం. అందుకే కాపీ కొట్టినట్లు అనిపించినా ఏదో కొత్తదనం ఉండటం వల్ల ఆ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల సినిమాలను, ఆర్టికల్‌లను ఒక్క క్లిక్‌తో చూసే అవకాశం దొరికింది కాబట్టి విదేశాల కంటెంట్‌కు నేటివిటీని జోడిస్తే ఆటోమేటిక్‌గా కొత్తదనం వచ్చేస్తోంది. ఇవి కూడా ఒకరకపు కొత్త ఐడియాలే.
పరిస్థితులను మార్చండి
ఎప్పుడూ ఒకే చోట, ఒకే రకం మనుషుల మధ్య ఉండటం వల్ల కొత్త ఐడియాలు రావు. అందుకే కొత్త ఐడియాలు రాక మదనపడుతున్న సమయంలో ట్రావెల్ చేయండి. మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లండి లేదా నచ్చిన వ్యక్తులను కలవండి. అప్పుడు మెదడు రిఫ్రెష్ అయ్యి, ఆటోమేటిక్‌గా కొత్త ఐడియాలు తన్నుకుంటూ వస్తాయి. ఇందుకు నిదర్శనంగా పాండమిక్ పరిస్థితులను తీసుకోవచ్చు. ఒకప్పుడు ఒకే ఆఫీసులో ఉండి పనిచేసినప్పుడు రాని ఐడియాలు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నప్పుడు వచ్చాయని, ఆ ఐడియాల వల్ల కంపెనీలు వృద్ధి చెందినట్లు మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి.
మిమ్మల్ని మీరే చాలెంజ్ చేసుకోండి
కంపెనీలో ప్రతి మూడు నెలలకు ఒకసారి పనితీరును విశ్లేషించి, రేటింగ్ ఇస్తున్నట్లుగానే మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా రేటింగ్ ఇచ్చుకోండి. ఒక ఐడియా వర్కవుట్ అయింది కదా అని విశ్రాంతి తీసుకుంటే మళ్లీ అలాంటి ఐడియాలే వస్తాయి తప్ప కొత్తవి రావు. కొందరు సినీ దర్శకులు తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా విదితమవుతుంది. కాబట్టి కంటెంట్‌లో క్లారిటీతో పాటు, సరికొత్తదనం రావాలంటే మిమ్మల్ని మీరు చాలెంజ్ చేసుకోవడం తప్పనిసరి.
రిస్క్ తీసుకోవడం ముఖ్యం
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. అని కాకుండా నలుగురితో పాటు నేనెందుకు? అని ప్రశ్నించుకుని అందుకు తగినట్లుగా ఐడియాలు వర్కవుట్ చేయడం మంచిది. అంటే ఐడియా రావడం ముఖ్యం కాదు..దాన్ని 99 శాతం మంది దాన్ని కాదు, జరగదు అని చెప్పినా మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని దాన్ని అమలు చేయడంలో రిస్క్ తీసుకోగల ధైర్యాన్ని పెంచుకోవాలి. ఐడియా విఫలమైతే ఏం చేయాలనే దాని గురించి కూడా ఒక్క ప్రణాళిక తయారు చేసుకుంటే పెద్దగా భయపడాల్సిన పని ఉండదు. అలాగే మీ ఐడియాను డిస్కస్ చేయడానికి సంకోచించకండి. అప్పుడే మీ ఐడియాకు ఎదురయ్యే సమస్యల గురించి మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ సమస్యల నుంచే మరో కొత్త ఐడియా పుట్టుకొస్తుంది.