నిండుకుండల్లా ప్రాజెక్టులు 

దిశ ప్రతినిధి, నల్లగొండ: రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిన్న నీటి వనరుల దగ్గరి నుంచి పెద్ద ప్రాజెక్టుల దాకా జలకళ సంతరించుకుంది. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా ఇళ్లు, కాలనీలు నీట మునిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు అలుగు పోస్తుండడంతో కొత్త ఉత్సహాం నిండుకుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పంట చేలన్నీ దాదాపుగా నీటిలో మునిగిపోయాయి. కాల్వలు, వాగులు వెంట వరి పొలాలు చాలా వరకు కొట్టుకుపోయాయి. అంతంత మాత్రంగా ఉన్న ఇళ్లు వర్షానికి నాని కూలిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇటు ప్రజలు.. అటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కొంతమంది అధికారులు మాత్రం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు వచ్చిన నష్టం ఏమీ లేదంటూ చెబుతున్నారు. మరోవైపు పంట చేలన్నీ నీటిలో మునిగి తెగుళ్ల బారినపడుతున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థతి..

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లా అంతటా జలకళ కన్పిస్తోంది. చిన్న చిన్న కుంటల దగ్గరి నుంచి ప్రాజెక్టుల దాకా నిండుకుండలా తలపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 2001 నీటి వనరులు ఉండగా, దాదాపు 75 శాతం వరకు చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో 1071 నీటి వనరులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1382 నీటివనరుల్లో 80 శాతం వరకు అలుగుపోస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు 4454 ఉన్నాయి. అందులో అధిక శాతం నీటి వనరులు మత్తడి దుంకుతున్నాయి.

నాగార్జునసాగర్‌లో పరిస్థితి ఇదీ..

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 14 గేట్లు ఎత్తి… 10 అడుగుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్కు ఇన్ఫ్లో 2,48,266 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా… అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 310 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుతం 589.60 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వచ్చే వరదలో హెచ్చుతగ్గులను బట్టి అధికారులు సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తడం, దించడం చేస్తున్నారు.

పులిచింతల ప్రాజెక్టు వరద ఇలా..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. జలాశయంలోకి భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతుండగా అధికారులు 14 క్రస్టు గేట్లను ఎత్తి మూడు అడుగుల మేర నీటికి దిగువకు వదులుతున్నారు. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 174 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3,68,208 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా పులిచింతల ప్రాజెక్టులోని 14 గేట్ల ద్వారా 3,53,948 క్యూసెక్కుల నీటిని అధికారులు కృష్ణానదిలోకి వదిలుతున్నారు.

మూసీ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువకు..

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు హైదరాబాద్ మహానగరంలో వస్తున్న వరదలతో మూసీ నదికి నీటి ప్రవాహాం పోటెత్తుతోంది. దీంతో మూసీ ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు 35,730 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వరద ప్రవాహం పెరగడంతో మూసీ ప్రాజెక్టు ప్రధాన కుడి కాల్వకు రెండు చోట్ల గండిపడింది. కేతేపల్లి శివారులోని నిమ్మలమ్మ చెరువు అక్విడెక్టు చైన్ నంబర్ 327 వద్ద, తుంగతుర్తి- చెరుకుపల్లి గ్రామాల సరిహద్దులో కాల్వ కట్ట తెగిపోయింది. భీమారం వద్ద ఉన్న మూసీ లోలెవల్ కాజ్ వే మీదుగా నీరు ప్రవహిస్తుండడంతో సూర్యాపేట- మిర్యాలగూడ పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

Advertisement