సిద్ధమవుతున్న గోదాములు

by Shyam |
సిద్ధమవుతున్న గోదాములు
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో ధాన్యం నిల్వలకు ప్రత్యేక గోదాములు ఏర్పాటు చేయనున్నారు. యాసంగి కాలంలో వచ్చిన దిగుబడితో జిల్లా‌లో ఉన్న గోదాములు సరిపోలేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను జిల్లాలో నిర్మించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాదనగర్, మహేశ్వరం, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలోని ప్రభుత్వ స్థలాలను స్థానిక ఎమ్మెల్యే‌తో పాటు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించారు.

ప్రస్తుతం జిల్లాలో29 గోదాములే…

వ్యవసాయ పంటల దిగుబడి ధాన్యం నిల్వ రంగారెడ్డి జిల్లాలో 29 గోదాములలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ గోదాముల సామర్థ్యం 75,900 మెట్రిక్ టన్నులు మాత్రమే. అందులో11 గోదాములు 400 నుంచి 2000 మెట్రిక్ టన్నుల చొప్పున 13,400మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలదు. నాబార్డ్ ద్వారా నిర్మించిన18 గోదాములు 2,500 నుంచి 5000 మెట్రిక్ టన్నుల చొప్పున 62,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగి ఉన్నాయి. అయినప్పటికీ సాగు విస్తీర్ణం పెరగడంతో ఈ గోదాములు సరిపోవడం లేదు. దీంతో అకాల వర్షాలు కురిసినప్పుడు ధాన్యం దాచుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

ప్రతిపాదనలు ఇవే…

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా జిల్లాలోని 6 నియోజకవర్గాలలో సుమారుగా 20 ఎకరాల ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్, శంకరపల్లి మండలాల్లో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలంలో, మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలం, షాదనగర్ నియోజకవర్గంలోని చేగూర్, నందిగామ మండలాల్లో, కల్వకుర్తి నియోజకవర్గంలోని అమన్గల్లు మండలంలోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటుకు జిల్లా అధికారులు నివేదిక రూపొందించారు. ఈ నివేదికను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed