- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా నివారణకు ఉద్యమ స్ఫూర్తి

దిశ, వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా ప్రజానీకం కరోనా వైరస్ కట్టడికి తగిన చర్యలు పాటిస్తూ.. నాడు స్వరాష్ట్ర సాధన కోసం చూపిన ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఊళ్లు, పల్లెలు, పట్టణాల్లో జనమంతా ఏకమయ్యారు. పొలిమేరల్లో ఎక్కడికక్కడే కంచెలు ఏర్పాటు చేసుకుని బయటివారిని ఊళ్లల్లోకి రానీయడం లేదు. నాడు ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా కాపలా కాసిన పోలీసులు ఇప్పుడు ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. డాక్టర్లయితే కరోనా వైరస్ బాధితుల ఆరోగ్యమే తమ ఆరోగ్యంగా భావించి ఇరవై నాలుగు గంటలు సేవలందిస్తున్నారు. ఏ ఒక్క ప్రాణానికి హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రానున్న ప్రమాదాన్ని నివారించేందుకు జనమంతా ఇళ్లకే పరిమితమై స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.
రోడ్లన్నీ బంద్..!
కరోనా వైరస్ ప్రభావంతో రోడ్లు బంద్ అయ్యాయి. జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టారు. కొత్త వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తూ.. అనుమానితులను క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు తమ వంతుగా సాయపడుతున్నారు. నిత్యావసర, అత్యవసర వస్తువుల కోసం ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారు. పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు గుంపులుగా ఉండకుండా గస్తీ తిరుగుతూ.. ప్రజలు రోడ్ల పైకి రాకుండా సహకరించాలని కోరుతున్నారు. ప్రజలు సైతం కరోనా వైరస్ నివారణకు ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు.
tags : Corona, Warangal, Police Patrolling, Telangana Movement, Self quarantine