పోడు వెనుక మాఫియా..?

by  |
పోడు వెనుక మాఫియా..?
X

దిశ ప్రతినిధి, వరంగల్: జిల్లాలో ఆదివాసీలకు, అటవీ అధికారులకు మధ్య వార్ నడుస్తోంది. అనాదిగా అడవి తల్లిని నమ్ముకున్న ఆదివాసీలు హక్కులు మావే అంటున్నారు. తరతరాలుగా సాంప్రదాయ బద్ధంగా వస్తున్న పోడు వ్యవసాయంపై హక్కులు కల్పించాలని కొట్లాడుతున్నారు. వారి పోరాటానికి ప్రజాసంఘాలు, పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి.

అడవిని నమ్ముకుని..

ఉమ్మడి జిల్లాలోని ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో అటవీ భూములున్నాయి. పస్రా నుంచి మొదలుకొని ఛత్తీస్ గఢ్, అటు భూపాలపల్లి నుంచి మొదలై మహారాష్ట్ర వరకు అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో ఎన్నో ఆదివాసీ గూడాలు వందల ఏళ్లుగా నివాసం ఉంటున్నాయి. సాంప్రదాయ బద్ధంగా వస్తున్న పోడు వ్యవసాయాన్ని గుర్తించి ఆ భూములపై హక్కులు కల్పించాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఆదివాసీలు గూడాల చుట్టూ పోడు వ్యవసాయం సాగవుతూనే ఉంది.

పోడు వెనుక రియల్ మాఫియా..?

ఏజెన్సీలోని‌ భూముల‌ ధరలకు రెక్కలు రావడంతో వాటిపై రియల్ మాఫియా కన్ని పడింది. పోడుభూముల వెనుక రియల్ దందా మొదలైందన్న ఆరోపణలు వినవవస్తున్నాయి. ఆదివాసీలను కొంతమంది దళారులు మచ్చిక చేసుకుని వారికి ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి వారితోనే అడవులను నరికించి వ్యవసాయం చేస్తున్నారు. స్థానికులతో ఆ భూమి పట్టాచేయించి తిరిగి వారికి అమ్మినట్లుగా పత్రాలు సృష్టిస్తున్నాఎనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు చత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చే ఆదివాసీలకు డబ్బులు ఇచ్చి అడవుల్లో గూడాలు ఏర్పాటు చేయిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఆ తర్వాత రెవెన్యూ అధికారులను నయానో భయానో దారికి తెచ్చుకుని వారికి రేషన్ కార్డులు కూడా ఇప్పిస్తున్నట్లు సమాచారం. ఇలా వారికి స్థానిక అర్హత కల్పించాక నివాసం ఉండే ప్రాంతాల నుంచి పోడుకొట్టిస్తారని తెలుస్తోంది.

ఆదివాసీలు, అటవీ అధికారుల మధ్య వార్

ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతోంది. అయితే ఇదే అదునుగా అటవీశాఖ అధికారులు ఆదివాసీలు పోడుభూములను టార్గెట్ చేశారు. ఆదివాసీలు సాగుకు సిద్ధమయ్యేలోపే అటవీ అధికారులు ఆ పోడుభూముల్లో హరితహారం పేరుతో మొక్కులు నాటుతున్నారు. ఆ విషయాన్ని తెలుసుకుని ఆదివాసీలు ఆ మొక్కలను తొలగించి వ్యవసాయం చేసుకుంటున్నారు. వలస వచ్చే గొత్తికోయలకు ఇంటి నంబర్లే ఉండవు. కానీ వారికి రెవెన్యూ శాఖ అధికారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు కార్డు ఇవ్వడం వలన వారు అడవి భూముల పై హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ‌ఈ విషయంలో రెవెన్యూ, అటవీశాఖలోని కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story