చెన్నై‌లో అడుగు పెట్టిన చిన్నమ్మ

by Shamantha N |
shashikala
X

చెన్నై: ఏఐఏడీఎంకే ‘బహిష్కృత’నేత వీకే శశికళ సోమవారం చెన్నైలో అడుగుపెట్టారు. సుమారు 200 వాహనాల కాన్వాయ్‌తో చెన్నైకి చేరిన చిన్నమ్మకు శ్రేయోభిలాషులు, మద్దతుదారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమిళనాడు సరిహద్దులోని జుజువాడి నుంచి చెన్నైలో టీ నగర్‌లోని ఆమె తాత్కాలిక నివాసం వరకు రోడ్డు పొడుగునా స్వాగతం పలికే ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లు వెలిశాయి. కాగా, అధికార పార్టీ పలుమార్లు హెచ్చరించినా శశికళ కారు బానెట్‌పై ఏఐఏడీఎంకే జెండాతోనే వచ్చింది. మేనల్లుడు టీటీవీ దినకరన్, జే ఇలవరసిలు శశికళతోపాటే వచ్చారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ సుమారు నాలుగేళ్లపాటు బెంగళూరులోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. గతనెల 27న విడుదలై బెంగళూరులోనే కొవిడ్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. తాజాగా, చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జయలలిత నెచ్చెలి శశికళ రాష్ట్రానికి చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏఐఏడీఎంకే జెండాను సభ్యులు కాకుండా వేరేవాళ్లు వాడకుండా ఆదేశాలు జారీ చేయాలని అధికార పార్టీ పోలీసులను కోరింది. ఆ మేరకు పోలీసులూ ఆదేశాలు విడుదల చేశారు. అయినప్పటికీ శశికళ ఏఐఏడీఎంకే జెండాను కారుపై ఉంచారు. దీనిపై టీటీవీ దినకరణ్ వివరణ ఇస్తూ శశికళ ఏఐఏడీఎంకే సభ్యత్వంపై పిటిషన్ కోర్టు విచారణలో ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed