- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోస్టు రద్దయినా తప్పని రెవెన్యూ బాధ్యతలు
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. నాలుగు నెలలుగా వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వారెక్కడ ఉండాలో, ఏం పనులు చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం కూడా ఎలాంటి విధి విధానాలు రూపొందించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిని ఏయే శాఖల్లో విలీనం చేస్తారో అధికారులకే అంచనా లేదు. కొన్ని జిల్లాలలో వీఆర్వోలకు భూ సంబంధిత విధులనే అప్పగిస్తున్నారు. చేయాలని ఆదేశిస్తున్నారు. దీంతో వీఆర్వోలు అయోమయంలో పడిపోతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తాజాగా రాష్ట్రంలో 9 లక్షలకు పైగా సాదాబైనామా ద్వారా ఈ- పీపీబీ కోసం రైతులు దరఖాస్తు పెట్టుకున్నారు. దానికి క్షేత్రస్థాయి పరిశీలన చేసి పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లపై పెట్టారు. కొంతమంది కలెక్టర్లు తహసీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేసి సాదాబైనామా, ఆర్ఎస్ఆర్ వ్యత్యాసాలు సరిచూడడం, విరాసత్, డిజిటల్ పెండింగ్ మ్యూటేషన్స్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, నిషేధిత భూముల వివరాల నమోదు వంటి అన్ని భూసంబంధ విధులను వీఆర్వోలకు అప్పగించాలని ఆదేశించారు. దీంతో వీఆర్వోలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి భూ సంబంధమైన విధులు నిర్వహించాలని హుకుం జారీ చేస్తున్నారు. విధులు చేయకపోతే తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సర్క్యులర్లు జారీ చేస్తున్నారని వీఆర్వోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సంబంధ అంశాల్లో తాము అవినీతికి పాల్పడామని తమ పోస్టులే రద్దు చేశారని, ఇప్పుడేమో మళ్లీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. కలెక్టర్లు , తహసీల్దార్లు ఇచ్చే ఆర్డర్ల కంటే ప్రభుత్వం ఆదేశాలిస్తే బాగుందని, తమను మానసిక వేధింపులకు గురిచేస్తున్న అధికారుల నుంచి రక్షణ కల్పించాలని వీఆర్వోల సంక్షేమ సంఘం కోరుతోంది.
అధికారిక ఆదేశాలు
సాదాబైనామాల క్రమబద్ధీకరణలో వీఆర్వోలు పని చేయాల్సిందేనని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోలికేరి ప్రొసిడింగ్ నెం.బీ2/0118/6/2021-బీ-సెక్షన్-డీసీఓ జారీ చేశారు. నాయబ్ తహసీల్దార్ తో పాటు గిర్దావర్, సీనియర్ అసిస్టెంట్, వీఆర్వోలు కూడా క్షేత్రస్థాయిలో సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో ఏకంగా 26,884 దరఖాస్తులు అందినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
* మహబూబ్ నగర్ జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులు, పెండింగ్ మ్యూటేషన్ దరఖాస్తులను పరిష్కరించేందుకు వీఆర్వోలు విధిగా పాల్గొనాలని భూత్పూర్ తహసీల్దార్ ఆరో తేదీన సర్క్యులర్ జారీ చేశారు. ఆయన కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు వీఆర్వోలకు విధులను అప్పగించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, నల్లగొండ జిల్లా కనగల్ మండలాల్లోనూ వీఆర్వోలకు రెవెన్యూ పనులను అప్పగించారు. అందులో పార్టు బీ, సాదాబైనామా దరఖాస్తులు, పెండింగులోని మ్యూటేషన్లతో పాటు ఇతర అన్ని దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు.
ప్రజాప్రతినిధుల పర్యటన బాధ్యత
గ్రామాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటిస్తే ఏర్పాట్ల బాధ్యతను కూడా వీఆర్వోలే నిర్వహించాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ప్రజాప్రతినిధుల పర్యటన బాధ్యతను వీఆర్వోలకు అప్పగించాలని తహసీల్దార్లను కలెక్టర్లు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు వీఆర్వోలకు పనులు అప్పగిస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన ఏర్పాట్లను వీఆర్వోలకు అప్పగిస్తూ తహసీల్దార్లు సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వీఆర్వోలకు విభిన్న రకాల విధులను అప్పగిస్తున్నారు.
న్యాయం చేయండి..
తమ సమస్యలు పరిష్కరించాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి వీఆర్వోల సంక్షేమ సంఘం మొర పెట్టుకుంది. పోస్టులు రద్దయినా అవే విధులు నిర్వహించాలని తహసీల్దార్లు బెదిరిస్తున్నారని విన్నవించింది. జీఓ నెం.514 ప్రకారం జూనియర్ సహాయకులకు, వీఆర్వోలకు 60:40 నిష్పత్తిలో పదోన్నతులు అమలు చేయాల్సి ఉందని, జూనియర్ సహాయకులకు అమలు చేస్తూ, వీఆర్వోలకు అమలుచేయకపోవడంతో అన్యాయం జరుగుతున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్ర రావు, ప్రధాన కార్యదర్శి హారాలే సుధాకర్, చీమల నాగేంద్రబాబు, ధరవత్ భాస్కర్, ఆదిత్య, గోవర్ధన చారి, లక్ష్మీనరసింహ, సత్యనారాయణ ఆదివారం పల్లాకు వివరించారు. వరంగల్ జిల్లాలో ప్రమోషన్లు అమలు చేయడంతో వీఆర్వోలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు. వరంగల్ కలెక్టరేట్ పరిపాలన అధికారితో పల్లా మాట్లాడారు. విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లాతానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఇల్లెందు తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను వాపస్ తీసుకుంటామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశాన్ని సోమవారం సీసీఎల్ఏ కార్యాలయ పరిధిలో ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు గరికె ఉపేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.