VROలకు ఇకసెలవు.. VRAలపై వీడని సస్పెన్స్..!

by  |
VROలకు ఇకసెలవు.. VRAలపై వీడని సస్పెన్స్..!
X

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ నాడు పటేల్-పట్వారీ వ్యవస్థకు మంగళం పాడితే, నేడు కేసీఆర్ వీఆర్వో వ్యవస్థకు కాలం తీరేలా చేశారు. వీఆర్వోల వ్యవస్థ రద్దు, జాప్యం లేకుండా మ్యూటేషన్లు వంటి వాటిపైనే కసరత్తు జరుగుతోందని ‘దిశ’ మూడు రోజుల ముందుగానే చెప్పింది. నేడు సరిగ్గా అదే జరిగింది. కేబినేట్ సమావేశానికి ముందే, రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల నుంచి దస్త్రాలను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. వారు వెంటనే ఆరు రకాల రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాత 29 రకాల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

అప్పట్లో గ్రామస్థాయి రికార్డులతోపాటు మండలస్థాయి రిజిస్టర్లు కూడా వారి వద్ద ఉండేవి. ఇప్పుడు సేత్వార్, ఖాస్రా, చెస్లా, 1బి రికార్డు, పహాణీలు, మ్యూటేషన్ లేదా ససెషన్ రిజిస్టర్లు, ఫైళ్లు, దరఖాస్తులు, పీఓటీ సాదా బయనామా, అసైన్మెంట్ ఫైళ్లు, నాలా ఫైళ్లు, విలేజ్ మ్యాపులు, టిప్పణీలు, ఉపయోగించని బిల్లు బుక్కులు, ఇతర పట్టాదారు పుస్తకాలను సేకరించారు. చాలా వరకు వారి పరిధిలో లేనివాటినే ఫారం-2 లో పేర్కొనడం గమనార్హం. అవన్నీ రెవెన్యూ రికార్డుల గదిలో ఉండేవే. దీంతో రెవెన్యూ శాఖలో వీఆర్వోల శకం ముగిసింది. రికార్డులన్నీ డిజిటలైజ్​ కావడం, కాస్తు కాలమ్​ తొలగించడం తదితర కారణాలతో భూపరిపాలనలో వారి అవసరం లేదని ప్రభుత్వం భావించింది. వారందరికీ జూనియర్ అసిస్టెంట్ కేడర్ ఇచ్చి ఇతర శాఖల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. దీని మీద కేసీఆర్​ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఏ శాఖల్లో విలీనం?

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల సంఖ్య 7300, వీఆర్ఏల సంఖ్య 24వేలు. విధుల్లో మాత్రం 4,800 మంది వీఆర్వోలు, 21 వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. ఈ రెండు శ్రేణులను ఇతర శాఖల్లో విలీనం చేస్తారా? వీఆర్ఏలను అలాగే కొనసాగిస్తారా? అన్నది తేలాలి. వీఆర్వోలను ఏయే శాఖల్లో విలీనం చేస్తారో అంతు చిక్కడం లేదు. ఎందులో విలీనం చేసినా సర్వీసు అంశాల్లో సమస్యలు తప్పవని ఉద్యోగులు వాపోతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల వీఆర్వో సంఘాలు మౌనం పాటిస్తున్నాయి. దీనిని వ్యతిరేకించి సాధించేదేం లేదని ఓ సంఘం ప్రధాన నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పని చేయించుకున్న ఆర్ఐలు, తహశీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయ లేదని పేర్కొన్నారు. వారి సంఘాల ప్రతినిధులు కూడా పని ఒత్తిడి గురించి ఎలాంటి ప్రస్తావన చేయడం లేదని వాపోయారు. ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దలు ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారోనన్న భయం వారిలో కనిపిస్తోంది. రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తూ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు.

రిజిస్ట్రేషన్ శాఖకు సెలవులు..

తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖ‌కు మంగళవారం నుంచి ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సెల‌వులు ఉంటాయని స్పష్టం చేసింది. స్టాంపుల కొనుగోలు, చ‌లాన్లు చెల్లించినవారికి సోమవారం రిజిస్ట్రేషన్లు అవుతాయ‌ని ఆ శాఖ క‌మిష‌న‌ర్ చిరంజీవులు ప్ర‌క‌టించారు. స్టాంపుల ‌విక్ర‌యాలు పూర్తిగా నిలిపివేశామ‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం నుంచి పూర్తిగా రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయ‌ని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టం రానున్నందున రిజిస్ట్రేషన్లు నిలిపివేశామ‌ని తెలిపారు. తిరిగి ఎప్పడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మొదలు పెట్టేది ప్రకటించలేదు.



Next Story

Most Viewed