‘ఐడియా’కు ఓ ఐడియా కావలెను!

by Harish |   ( Updated:2020-02-26 05:42:05.0  )
‘ఐడియా’కు ఓ ఐడియా కావలెను!
X

దిశ, వెబ్‌డెస్క్ : టెలికాం రంగంలో చాపకింద నీరులా సంక్షోభం కొనసాగుతోంది. జియో వచ్చిన తర్వాత నుంచి వినియోగదారుల్ని సంపాదించుకోవడం కంటే వారిని కాపాడుకోవడానికే టెలికాం సంస్థలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. టెలికాం రంగాన్ని శాసించిన ఎన్నో నెట్‌వర్క్‌లు సిగ్నల్స్ మూసుకున్నాయి. ఇక మిగిలిన వాటిలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ఎలాగో నెట్టుకొస్తున్నాయి. అయితే, తాజాగా ట్రాయ్ వినియోగదారుల లెక్కల్ని విప్పింది. అవేంటంటే!

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తాజా నివేదిక ప్రకారం వొడాఫోన్ ఐడియా 2019 డిసెంబర్‌లో 36.4 లక్షల మంది వినియోగదారుల్ని కోల్పోయింది. 2019 నవంబర్ నాటికి వొడాఫోన్ ఐడియా సుమారు మూడున్నర కోట్ల మంది వినియోగదారుల్ని కోల్పోయింది. మొత్తం 11 నెలల్లో మార్కెట్ వాటా ప్రకారం రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన వొడాఫోన్ ఐడియా 75 లక్షల మంది వినియోగదారుల్ని కోల్పోయింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం వొడాఫోన్ ఐడియా చందాదారుల సంఖ్య డిసెంబర్ నాటికి 33.26 కోట్లుగా ఉంది.

‘వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ నాణ్యత లేకపోవడం వినియోగదారులు తగ్గడానికి కారణమని చెప్పవచ్చు. గతేడాది చివర్లో పెంచిన టారిఫ్‌లు కూడా మరో కారణమై ఉండవచ్చని’ సంబంధిత ప్రతినిధి చెప్పారు. ‘గడిచిన రెండు నెలల్లో వొడాఫోన్ ఐడియా కస్టమర్లు తగ్గిన స్థాయిలోనే ఎయిర్‌టెల్ వినియోగదారులు పెరిగారు. అంటే, వొడాఫోన్ ఐడియా నుంచి వెళ్లిపోయేవారు ఎక్కువ శాతం ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు’ అని ఆయన స్పష్టం చేశారు. గతేడాది నవంబర్‌లో ఎయిర్‌టెల్ 16.59 లక్షల మంది వినియోగదారుల్ని సంపాదించుకోగా, డిసెంబర్ నాటికి 11,050 మంది వినియోగదారుల్ని మాత్రమే కోల్పోయింది.

మిగిలిన నెట్‌వర్క్‌ల సంగతి పరిశీలిస్తే… ఎమ్‌టీఎన్ఎల్ డిసెంబర్‌లో 5,155 మందిని కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా 4.27 లక్షల మందిని, రిలయన్స్ జియో 82,308 మందిని, రిలయన్స్ కమ్యూనికేషన్ 444 మందిని కోల్పోయాయి. ఇండియాలో వరుసగా రెండు నెలలపాటు టెలికాం వినియోగదారుల సంఖ్య తగ్గింది. 2019 నవంబర్‌ నాటికి ఇండియాలో 117.59 కోట్ల టెలికాం వినియోగదారులు ఉన్నారు. అయితే, డిసెంబర్ చివరినాటికి ఈ సంఖ్య 117.24 కోట్లకు క్షీణించింది. అంటే, కేవలం డిసెంబర్ నెలలోనే 34.4 లక్షల మంది వినియోగదారులు తగ్గారు.

బీఎస్ఎన్ఎల్, ఎమ్‌టీఎన్ఎల్ గడిచిన రెండు నెలల్లో వైర్‌లెస్ సేవల్లో తమ మార్కెట్ వాటాను పెంచాయి. నవంబర్‌లో 10.49 శాతం మార్కెట్ వాటా నుంచి 10.55 శాతానికి పెరిగింది. ప్రైవేట్ ఆపరేటర్ల వాటా 89.51 శాతం నుంచి 89.45 శాతానికి తగ్గింది. 32.14 శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ జియో అన్ని టెలికాం సంస్థల కంటే ముందుంది. 28.89 శాతంతో వొడాఫోన్ ఐడియా, 28.43 శాతంతో ఎయిర్‌టెల్ సంస్థలు మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. 2019, నవంబర్‌తో పోలిస్తే రిలయన్స్ 0.1 శాతం, ఎయిర్‌టెల్ 0.08 శాతం, వొడాఫోన్ ఐడియా 0.23 శాతం మార్కెట్ వాటాను కోల్పోయాయి.

Advertisement

Next Story

Most Viewed