15 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు!

by  |
15 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు!
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆఫీసర్ల అలసత్వం, దళారులకు బడానేతల అండ, సర్కారు నిర్లక్ష్యం వెరసి నిరుపేదలకు శాపంగా మారింది. సర్వం కోల్పోయిన ఆ గ్రామస్తులకు నేడు చివరకు ఉండేందుకు గూడు కూడా లేక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. పాలకులు, ప్రభుత్వాలు మారాయి. స్వరాష్ట్రం ఏర్పడింది. అయినా గత పదిహేనేండ్లుగా వారికి దక్కాల్సిన నష్టపరిహారం అందించడంలో పాలకవర్గాలు, అధికారులు మాత్రం విఫలమవుతూనే ఉన్నారు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ గ్రామ సమీపంలో రిజర్వాయర్ నిర్మాణానికి అప్పటి ఉమ్మడి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. రూ.36.98 కోట్లతో 46,800 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్టరిపరిహారం కూడా చెల్లించారు. రిజర్వాయర్ పూర్తి కూడా అయింది. కానీ, ఆ రిజర్వాయర్‌లో నీటిని నిల్వ ఉంచుతున్న క్రమంలో సమీపంలోని గ్రామంలోని నీటి ఊటలు రావడం ప్రారంభమైంది. దాంతో పలు సమస్యలు తలెత్తాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సర్కారు గ్రామాన్ని ఖాళీ చేయించి, వారికి రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వారి ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించింది. కానీ, ఆచరణలో ఏండ్లు గడుస్తున్నా వారికి అవేవీ దక్కలేదు.

జీవో నెం.122 ఆసరాగా నిర్మాణాలు

బాధితులను ఆదుకునేందుకు 2010లో అప్పటి సర్కారు జీవో నెం.122ను కూడా విడుదల చేసింది. ఈ జీవోను ఆధారం చేసుకుని పరిహారం వస్తుందనే దురాశతో గ్రామంలో కొంత మంది నాయకుల అండదండలతో దళారులు సుమారు 180 షెడ్లను నిర్మించారు. గ్రామంలో అప్పట్లో పర్యటించిన అధికారులు కేవలం 520 ఇండ్లకే పరిహారం అందించేందుకు నివేదికలను సిద్ధం చేశారు. ఆ ఇండ్లకు డోర్ నెంబర్లు సైతం వేశారు. కానీ, ఆ డ్రాఫ్ట్ డిక్లరేషన్ మాత్రం ఇంతవరకు చేయలేదు. దాంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిహారం ఇప్పటికీ అందలేదు.

మంత్రి అదేశాలతో మొదటికి..

గతంలో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ పర్యటన సమయంలో ఈ నష్టపరిహారం విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అక్రమ షెడ్లకు పరిహారం చెల్లించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అదేశాలు జారీ చేయడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. ఆ అదేశాలతో నేటి వరకు అర్హులైన బాధితులకూ నష్టపరిహారం అందలేదు. బాధితులు అనేక అవస్థలు పడుతున్నారు. వానాకాలం వచ్చిందంటే గ్రామస్తులకు భయం వెంటాడుతుంది. నీటి ఊట కారణంగా గ్రామంలో పునాదులలోకి నీరు చేరి ఇప్పటికే చాలా వరకు ఇండ్లు కుంగిపోయాయి. నెర్రలు వారాయి. మరికొన్ని ఇండ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలీపోతాయేనని ఆందోళన చెందుతూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటకైనా ప్రభుత్వం స్పందించి అక్రమ షెడ్లను వేసిన వారిని మినహాయించి అర్హులను గుర్తించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed