గ్రామస్తుల చొరవ.. నిలిచిన ప్రాణాలు

దిశప్రతినిధి, ఆదిలాబాద్:
వాగులో చిక్కుకున్న పిల్లలు గ్రామస్తుల చొరవతో ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బైంసా మండలం లో చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే… దేగాం గ్రామ సమీపంలోఉన్న సాయిబాబా ఆలయం వెనుక గల పెద్ద వాగులో ఆడుకునేందుకు ఆరుగురు పిల్లలు వెళ్లారు. ఎగువన భారీ వర్షంతో ఒకేసారి వాగులోకి వరద వచ్చింది.

దీన్ని గమనించిన ముగ్గురు పిల్లలు పరుగున ఒడ్డుకు చేరుకున్నారు. కాగా మరో ముగ్గురు వాగులోనే చిక్కుకున్నారు. వాగు నడుమన ఉన్న పెద్ద బండ పైకి ఆ పిల్లలు చేరుకున్నారు. కాగా ప్రమాద సమాచారాన్ని గ్రామస్తులకు ఒడ్డుకు చేరిన పిల్లలు పరుగున వెళ్లి చెప్పారు. . దీంతో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రొక్లెయిన్ సహాయంతో పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. కాగా ముగ్గురు చిన్నారులు సురక్షితంగా ప్రాణాలతో బయట పడడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement