పల్లెను కన్నీరు పెట్టిస్తున్న కరోనా

by Anukaran |
పల్లెను కన్నీరు పెట్టిస్తున్న కరోనా
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా సమాజాన్ని తలాకుతలం చేస్తోంది. పట్నంలో ఉండనిస్తలేదు. పల్లె రమ్మంటోంది. కరోనా నుంచి దూరంగా ఉండొచ్చనని మనసు చెబుతోంది. సంపన్నవర్గాల ఇండ్లు కొడుకులు, కోడ ళ్లు, మనవలు, మనవరాళ్లతో కళకళలాడుతుండొచ్చు. పేదల ఇరుకు ఇండ్లలో కరోనా చిచ్చు పెడుతోంది. ఊరు విశాలంగా ఉంది. పేదలు, మధ్య తరగతి ఇండ్లు చిన్నగా ఉన్నాయి. అక్కడే పంచాయతీలు మొదలవుతున్నాయి.

‘‘చిన్నరెవెల్లిలోని మరో కుటుంబంలోనూ ఇద్దరు అన్నదమ్ములు. పొలం పంచుకుంటే చెరో మూడెకరాలు వచ్చింది. పెద్దాయనే మొత్తం సాగు చేసేవాడు. పండుగలప్పుడు చిన్నోడి కుటుంబం ఊరికి వస్తే మర్యాదలన్నీ చేసేవాడు. వెళ్లేటప్పుడు బియ్యం, పప్పు, కూరగాయలు వంటివి సరిపడా ఇచ్చేవాడు. లాక్ డౌన్, కరోనా ప్రభావంతో చిన్నోడి ఉద్యోగానికి ఎసరొచ్చింది. ఊరికి రావ డం..అక్కడే ఉండడం అనివార్యమైంది. తన భాగం తానే సాగు చేసుకుంటానన్నాడు. ఇక నా బతుకెట్లా అంటూ పెద్దోడి ఆవేదన. పెద్ద మనుషులకు విన్నవించుకున్నాడు’’

పట్నవాసులు పల్లెకు చేరిన తరువాత ఒకటీ రెండు వారాలు ఆనందంగానే గడిచాయి. చేతిలో గవ్వలన్నీ అయిపోగానే అసలు కథ మొదలైంది. ఉపాధి వెతుకులాటలో ఇబ్బందులు మొదల య్యాయి. అప్పటి దాకా ఉన్న కాస్త భూమి సాగు చేసే సోదరుడి దగ్గర వాటా అడగక తప్పనిసరి పరిస్థితి. ఆ కాస్తలో సగమిస్తే తానెట్లా బతికేదంటూ సోదరుడి ఆవేదన. పంచాయతీలు మొద లయ్యాయి. నాలుగు గదుల ఇంటి మధ్య గోడ కట్టాల్సిందేనంటూ ఆడవాళ్లు పేచీ పెడుతున్నారు. లాక్డౌన్ తొలిరోజుల్లో ఆనందం వెల్లివిరిసిన ఇండ్లల్లో నేడు తిట్ల దండకం వినిపిస్తోంది. పట్నం వెళ్లి మళ్లీ పని చేసే రోజులు కనిపించకపోవడంతో ఊరే దిక్కయ్యింది. పంపకాలు తప్పనిసరయ్యాయి. ప్రతి పల్లెలో పదుల సంఖ్యలో ఇలాంటి పంచాయతీలు, గొడవలే దర్శనమిస్తున్నాయి. ప్రతి రచ్చబండ వెనుకటి రోజులను గుర్తు చేస్తోంది. బంధాలు, బాంధవ్యాల తగాదాలను పరిష్కరించేందుకు ఊరి పెద్దలు తలమునకలయ్యారు. ఓటెయ్యాలంటూ పట్నం ఓటర్లను కిరాయిలు ఇచ్చి ఆహ్వానిం చిన సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు ఎవరినీ కాదనలేక తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు

పట్నాల నుంచి పల్లెలకు తిరిగొచ్చిన వాళ్లు ఎక్కడ ఉండాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కాస్తో కూస్తో డబ్బులు ఉన్నోళ్లు రెండు గదులైనా కట్టుకుందామని పనులు మొద లు పెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేనోళ్లేమో ఉన్న ఇంటిని పంచుకునేందుకు పంతం పట్టి కూర్చున్నారు. ఇప్పటికప్పుడు ఇల్లు కట్టుకునే స్తోమత లేనివారి సంఖ్యనే అధికం. ఉపాధిని వెతుక్కోవ డం కంటే తన వాటా భూమినే సాగు చేసుకోవాలన్న నిర్ణయంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. ఊళ్లలో పదుల సంఖ్యలో పంచాయతీలు నడుస్తున్నాయని రైతు సమన్వయ సమితి మం డల అధ్యక్షుడు ఒకరు వాపోయారు. పరిష్కారం దొరకకపోవడంతో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారని చెప్పారు. భూముల సమస్యలు పరిష్కరించాలంటూ రెవెన్యూ కార్యాలయాల్లో అర్జీలు పెట్టుకుంటున్నారన్నారు. దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఈ ఇంటి గొడవలు పెరగడంతో వాతావరణం చెడిపోయిందన్నారు.

రూ.లక్షలు పలికే భూములతోనే

ఇన్నాండ్లుగా అన్నో తమ్ముడో సాగు చేసుకున్నా బంధాలు భరించాయి. ఇప్పుడు పని లేకపోవడంతో వాటాల కోసం పేచీ పెడుతున్నారు. ఎకరా రూ.లక్షలకు పైగా పలుకుతుండడంతో గజం కూడా వదులుకునే పరిస్థితులు లేవు. పెరిగిన భూముల ధరలతోనే పంతాలు పెరిగిపోతున్నాయి. ఈ పంచాయతీల నేపథ్యంలో మద్యం అమ్మకాల జోరు రెట్టింపయ్యింది. బాధితుల జేబులు ఖాళీ అవుతున్నాయి. దావత్లు నడుస్తున్నాయి. చికెన్ అమ్మకాలు బాగా సాగుతున్నాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, వికారాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సామాను ఏడ పెట్టాలి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నరెవెల్లిలో ఇద్దరు అన్నదమ్ములు బాగా సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో ఉండేవారు. పండుగలకు ఇంటికొచ్చి ఎంజాయ్ చేసేవారు. లాక్ డౌన్ తో రెండు కుటుంబాలు ఊర్లోనే ఉండాల్సి వచ్చింది. కొద్ది రోజులపాటు బాగానే ఉన్నారు. అందులో ఒకరి ఉద్యోగం ఊడింది. దాంతో ఆయన నగరంలోని ఇంటిని ఖాళీ చేసి సామాను ఊర్లోనిఇం టికి తీసుకెళ్లారు. సామాను ఎక్కడ పెట్టాలో తెలియదు. రెండు పొయ్యిలు పెట్టే జాగ లేదు. దాంతో ఇంటి కోసం రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది.

బెంగుళూరు నుంచి తండాకు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం గాలిగూడెం దగ్గర గిరిజన తండాలో అనేక కేసులు వచ్చాయి. కరోనాకు ముందు చాలా మంది బెంగుళూరులో పని చేసేవారు. లాక్ డౌన్ తో పదుల సంఖ్యలో కుటుంబాలు తండాకు వచ్చాయి. ముగ్గురు అన్నదమ్ములున్న కుటుంబంలో ఒక్కరే ఊర్లో ఉంటూ పొలం చూసుకునేవారు. దాదాపు అందరి పరిస్థితి అంతే.. ఎవరో ఒకరే ఇంటి దగ్గర ఉంటూ వాళ్ల భూముల్లో వ్యవసాయం చేసేవారు. పండుగలు, ఫంక్షన్లకు వచ్చివెళ్తుండే వారు. ఇప్పుడేమో చాలా కుటుంబాల్లో ఎవరికి వారు సాగు చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. ఇక భూముల పంపకంపై పేచీలు సాగుతున్నాయి. కరోనా ప్రభావంతో ఎవరూ ఇంటిని కిరాయికి ఇవ్వడం లేదు. పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతున్నారు.

ఒక్క ఊరిలో 30 గొడవలు

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం స్వాములవారిలింగోటం అనే ఊరు హైదరాబాద్ కు 70 కి.మీ. దాంతో వందలాది కుటుంబాలు వలసొచ్చాయి. ఇప్పుడా కుటుంబాలు తిరుగు ప్రయాణం కట్టాయి. ఇక ఇండ్లు, భూముల పంపకంలో మునిగి తేలుతోంది. ఆఖరికి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ అధికారుల చట్టూ ప్రదక్షిణాలకే కాలమంతా వెళ్లదీస్తున్నారు. ఇన్నాళ్లుగా కనిపించిన ప్రేమలు, ఆప్యాయతలన్నీ కరోనా పెట్టిన చిచ్చుతో ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. ఇంకెన్నాళ్ల సమయం పడుతుందోనని ఊరి పెద్దలు పరేషాన్ అవుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ కు 100 కి.మీ. లోపల ఉన్న పల్లెల్లోనే ఇలాంటి వివాదాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed