హడలెత్తిస్తున్న కేసులు..లాక్‌డౌన్‌‌ దిశగా పల్లెలు

by  |
హడలెత్తిస్తున్న కేసులు..లాక్‌డౌన్‌‌ దిశగా పల్లెలు
X

దిశ, కరీంనగర్: పల్లెల్లోని ప్రజలు లాక్‌డౌన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని చెబుతూ లాక్‌డౌన్ ఎత్తేయడంతో కరోనా బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. దీంతో ఆందోళనకు గురైన పల్లె వాసులు సెల్ఫ్ లాక్‌డౌన్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. తమ ఊర్లో ఒక్క పాజిటివ్ కేసు నమోదైందంటే చాలు వెంటనే గ్రామంలో లాక్‌డౌన్ ప్రకటించుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే ఈ స్వీయ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం వల్బాపూర్‌లో ఆదివారం నుంచి 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు పంచాయతీ తీర్మానించింది. పక్షం రోజులకు సరిపడా నిత్యవసరాలు ముందుగానే తెప్పించుకుని పెట్టుకోవాలని సూచించింది. అత్యవసర పని పడితే తప్ప బయటకు రావొద్దని, రోడ్లపై కనిపిస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని కూడా పంచాయితీ స్పష్టం చేసింది. గ్రామస్థులు స్వీయ నిర్భందానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని పంచాయితీ సభ్యులు కోరారు. ఇటీవల గ్రామానికి చెందిన పలువురు కరోనా బారిన పడటంతో పాటు వారితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారి సంఖ్య కూడా తీవ్రంగా ఉన్నది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో గత మూడ్రోజులుగా గ్రామంలో లాక్‌డౌన్ అమలు పరుస్తున్నారు. అవసరమైతే మరిన్ని రోజులు కూడా స్వతహాగా స్వీయ నిర్బంధం పాటించాలని గ్రామస్థులు భావిస్తున్నారు.


Next Story