వీహెచ్ బుజ్జగిస్తే..డీకే ఆహ్వానించే..!

by Shyam |
వీహెచ్ బుజ్జగిస్తే..డీకే ఆహ్వానించే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతోంది. ఓ వైపు ఆ పార్టీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్న సమయంలోనే చాలా మంది కాంగ్రెస్ కీలక నేతలు, యువ నేతలు హస్తం పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్‌ మీద పట్టు ఉన్న నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కమలం వైపు వెళ్తున్నారు.

ఇప్పటికే, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డిలు బీజేపీలో చేరడమే కాకుండా కమలం తరఫున ప్రచారం కూడా చేస్తున్నారు. వీరికి తోడు మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.దీంతో, కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు వెళ్లినా చర్చలు మాత్రం విఫలం అవుతున్నాయి. ఇదే సమయంలో ఆహ్వానిస్తున్న కమలనాథులు అయితే సక్సెస్ అవుతున్నారు.

ఇటీవల భిక్షపతి యాదవ్ ఇంటికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి నేతలు వెళ్లి బుజ్జగింపులు చేసినా.. అదే రోజు భిక్షపతి బీజేపీలో చేరడం గమనార్హం. దీనికి తోడు ఇంకెన్నాళ్లు కాంగ్రెస్‌ను మోయాలని కుండబద్దలు కొట్టారు. దీంతో, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పట్టుకోల్పోయింది. ఇక ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోని కీలక నాయకులను కాపాడుకునే పనిలో కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎప్పుడూ ఏ నేత పార్టీ జంప్ అవుతారో అని ఆ నాయకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

సరిగ్గా ఇదే సమయంలో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. పార్టీ మారి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న వార్తలు కలవరం రేపాయి. దీంతో అప్పట్లో ముఖేశ్ గౌడ్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్వయంగా విక్రమ్ గౌడ్‌ను కలిశారు. పార్టీ మారొద్దు అని బుజ్జగించారు. అయినప్పటికీ ఆ చర్చలు ఫలించనట్టు సమాచారం. అనంతరం అక్కడి నుంచి వీహెచ్ వెనుదిరిగారు.

ఇక కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితోనే బీజేపీలో చేరిన డీకే అరుణ ఈ సాయంత్రమే విక్రమ్‌గౌడ్‌ను కలవనున్నారు. బీజేపీ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇక విక్రమ్ గౌడ్ ‌ నిర్ణయం పై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story