కనీస మద్దతు ధరపై జేపీసీ వేయాలి: విజయసాయి రెడ్డి

by srinivas |
కనీస మద్దతు ధరపై జేపీసీ వేయాలి:  విజయసాయి రెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్దత కల్పించే విషయంలో చర్చలు జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో బుధవారం జీరో అవర్‌లో కనీస మద్దతు ధరపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేయడాన్ని దేశంలోని రైతాంగం స్వాగతించిందని తెలిపారు. అయితే రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ మెుదలైందని చెప్పుకొచ్చారు. ఎంఎస్‌పీకి చట్టబద్దత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించే అంశాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించిందని చెప్పుకొచ్చారు.

కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర ప్రకటించగా అందుకు అదనంగా ఏపీ ప్రభుత్వం మరో 24 వ్యవసాయ ఉత్పాదనలకు ఎంఎస్‌పీ ప్రకటించిందని రాజ్యసభలో తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే 47 పంటలు ప్రస్తుతం కనీస మద్దతు ధర పరిధిలోకి వచ్చాయని తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఉండేలా రైతులకు చట్టబద్దమైన హామీ కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌పీ విషయంలో క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్ళపై స్పష్టత రావాలంటే రైతులు, రైతు సంఘాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని.. అందుకు సంప్రదింపులే ఏకైక మార్గమని సూచించారు. రైతులు, రైతు సంఘాలతో చర్చలు, సంప్రదింపులకు తగిన వేదిక కల్పించడం శాసనకర్తలుగా మన విధి, బాధ్యత అని అన్నారు. కాబట్టి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో ముడిపడిన వివిధ సమస్యలపై సంబంధింత భాగస్వాములతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటు చేయవలసిందిగా సభకు విజ్ఞప్తి చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు.

Advertisement

Next Story