కడవరకు జగన్ వెంటే: విజయసాయిరెడ్డి

by srinivas |
కడవరకు జగన్ వెంటే: విజయసాయిరెడ్డి
X

దిశ ఏపీ బ్యూరో: కడవరకూ వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. వైజాగ్‌లో ఆయన మాట్లాడుతూ, జగన్ తనను పక్కన పెట్టారని, విశాఖ ఇన్‌చార్జీ పదవి నుంచి కూడా తొలగించనున్నారంటూ దుష్ప్రచారం జరుగుతోందని.. అయితే అదంతా తప్పుడు ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీతో పాటు జగన్‌తో తనకు చాల బలమైన అనుబంధం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారని, అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమవుతారని చెప్పారు.

నిమ్మగడ్డ వివాదంపై మాట్లాడుతూ, కేంద్ర పరిధిలోని ప్రభుత్వోద్యోగుల నియామకాలు సాధారణంగా రాష్ట్రపతి, గవర్నర్ పేరిట జరుగుతాయని, తనను తాను నియమించుకోవడం బహుశా నిమ్మగడ్డ రమేశ్‌కే చెందిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఎప్పుడూ శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నడుస్తుందని అన్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో తమ సోషల్ మీడియా కార్యకర్తలను ఎంతో టార్చర్ పెట్టారని ఆరోపించారు. అప్పట్లో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన అరాచకాలను వెలికి తీస్తే, వారిని పెట్టేందుకు జైళ్లు కూడా సరిపోవని ఆయన తెలిపారు. ఫేక్ అకౌంట్లతో తన పేరిట జగన్‌ను దూషించిన ఉదంతాలు ఉన్నాయని చెప్పారు.

తమ కార్యకర్తలు అలా కాదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారు అమాయకులని, పార్టీ కోసం ఎంతో శ్రమించే వ్యక్తులని తెలిపారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏదైనా కేసులో ఇరుక్కుంటే తాము వారిని దూరం చేసుకోమని అన్నారు. వారి కోసం కోర్టులో పోరాడుతామని చెప్పారు. కోర్టులపై తమకు ఎంతో గౌరవముందని అన్నారు. అందుకే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ పై తప్పుడు కేసులు పెట్టినా, 16 నెలలు జైల్లో ఉంచినా శాంతియుతంగానే పోరాడామని విజయసాయిరెడ్డి తెలిపారు.

Advertisement

Next Story