నాలో…నాతో..వైఎస్సార్: విజయమ్మ

దిశ ఏపీ బ్యూరో: నేడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి 71వ జయంతి. మహానేతగా వైఎస్సార్సీపీ అభివర్ణించే వైయస్సార్‌ జయంతిని ఇడుపులపాయలో వేడుకగా నిర్వహించనున్నారు. జగన్ చిరకాల స్పప్నం నెరవేరిన రెండో ఏడాది వస్తున్న జయంతి కావడంతో పేదలకు పట్టాల పంపిణీ ద్వారా దానిని మరింత వైభవంగా నిర్వహించాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడంతో పుస్తకావిష్కరణతో వేడుకను ఆసక్తిగా మలచనున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు ఉదయం నిర్వహిచనున్న కార్యక్రమంలో వైఎస్సార్ సతీమణి వైయస్‌ విజయమ్మ రాసిన ‘‘నాలో… నాతో… వైయస్సార్‌’’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్నారు.

వైయస్సార్‌ సగభాగంగా, సహచరిగా, 37 ఏళ్ల జీవితాన్ని ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి తీసుకురానున్నారు. అంతే కాకుండా 2009 సెప్టెంబరు 2న ఆయన ఆనూహ్యంగా నిష్క్రమించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారమే ఈ పుస్తకం. ఆయనలోని ఒక పార్శ్యాన్ని మాత్రమే ప్రజలు చూడగలిగారు. వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారు? ఆయన జీవితంలో చోటుచేసుకున్న ఘట్టాలేంటి అన్నది రాజకీయ సహచరులకు కూడా తెలియని విషయాలను, ఆయన మరణానంతరం ప్రజలు ఆయనను ఎలా భావించారన్న విషయంతో పాటు ఆయన గురించిన పలు విశేషాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు విజయమ్మ తొలిపలుకుల్లో వివరించారు.

రాజశేఖరరెడ్డి రాజకీయ నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. అయితే ఒక తండ్రిగా, భర్తగా, వ్యక్తిగా, కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల డాక్టర్‌గా వైయస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటినుంచి వైయస్సార్‌ నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, ఎలా ఉండేవారన్న విషయాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని విజయమ్మ భరోసా ఇస్తున్నారు. ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆయన వేసిన అడుగులు, వాటి వెనుక వాస్తవాలు, ఆయన ఆలోచనలు, అనుభవాలు, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును ఇలా ప్రతి అంశాన్ని ఈ పుస్తకంలో స్పృశించారు.

ఆయన ప్రజలకు దగ్గరైన విధానం, ప్రజల్లోకి దూసుకెళ్లిన తీరు, ప్రజల నేతగా పేరొందిన విధానం వంటి విశేషాలన్నీ ఈ పుస్తకంలో ఉండనున్నాయని విజమయ్మ తెలిపారు. రాజశేఖరరెడ్డి పెంచి, పంచిన మంచితనాన్ని తన పిల్లలూ, మనవలకే కాకుండా ప్రతి ఇంటా ఉండాలన్న లక్ష్యంతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఆయనను ప్రేమించిన ప్రతి తెలుగు వ్యక్తికి అంకితం చేస్తున్నానని ఆమె తెలిపారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమన్న ఆమె, తెరవని పేజీలను తాను రాస్తున్నానని ఆమె చెప్పారు. ఈ పుస్తకం ఎమ్మెస్కో పబ్లికేషన్స్‌లో దొరుకుతుందని ఆమె పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

Advertisement