సునామిలా దూసుకొస్తున్న సేతుపతి.. ఇక వారికి కష్టమే!

by Shyam |
Vijay Sethupathi
X

దిశ, వెబ్‌డెస్క్: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ప్రస్తుతం ఈ పేరు తమిళ్‌‌లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ అంతటా మారుమోగుతోంది. వరుస సినిమాలతో దక్షిణాన బిజీ స్టార్‌ అయిపోయారు. సైరా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన సేతుపతి వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఓ వైపు హీరోగా రాణిస్తూనే ప్రతినాయకుడి గానూ మెప్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన విజయ్ యాక్టింగ్‌కు తెలుగు ఫ్యాన్స్ సైతం ఫిదా అయ్యారు. ఒకానొక సందర్భంలో విజయ్ ఒక్కడే ఆ సినిమాను ఒంటి చేత్తో విజయతీరాలను చేర్చాడు అనడంలో అతిశయోక్తి లేదు. అంతటి ప్రతిభా పాటవాన్ని కనబరిచిన విజయ్‌కు తెలుగులో అభిమాన దళం కూడా పెరుగుతోంది. సేతుపతి సినిమా అనగానే ఎప్పుడు థియేటర్స్‌కు వస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. విజయ్ క్రేజ్‌ను గమనిస్తున్న టాలీవుడ్ స్టార్స్ చాలా మంది తమ సినిమాల్లో విజయ్ సేతుపతినే విలన్‌గా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో విజయ్ సేతుపతిని విలన్ రోల్ కోసం సంప్రదించారని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Sethupathi

ప్రతీ సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్న సేతుపతి తన అభినయంతో అందరినీ తనవైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. ఇక విజయ్ స్టామినా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసేస్తున్నాడు. భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగితే తెలుగులోనూ విజయ్ హవా మమూలుగా ఉండదనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పటికే సూర్య, కార్తీ, విజయ్ ఇళయతళపతి విజయ్, విక్రమ్ వంటి హీరోలకు మంచి మార్కెట్ ఉంది. కొత్తగా విజయ్ సేతుపతి కూడా వారి సరసన చేరాడు. అదే జరిగితే టాలీవుడ్‌లో కొత్తగా మార్కెట్ కోసం పోటీ పడుతున్న నటీనటులపై తీప్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

విజయ్ సేతుపతి తమిళ్ మూవీ ‘మాస్టర్‌’తో పాటు తెలుగు మూవీ ‘ఉప్పెనలోనూ ప్రతినాయకుడిగా కనిపించడంతో ఓ వర్గం ఆడియెన్స్‌‌కు బాగా దగ్గరయ్యాడు. దీంతో మూవీ మూవీకి అంచనాలు భారీ స్థాయిలో క్రియేట్ అవుతున్నాయి. దర్శక, నిర్మాతలందరూ ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ రాకతో ఇప్పటికే విలన్‌ పాత్రల్లో మంచి గుర్తింపు పొందిన నటులకు సైతం అవకాశాలు తక్కువ అవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో ఎన్ని మైనెస్‌లు ఉన్నా అభిమానులను థియేటర్‌కు వచ్చేలా చేస్తుండటంతో సేతుపతిపైనే అందరి దృష్టి పడుతోంది. ఈ ఒక్క రీజన్ వలన తెలుగు విలన్‌లకు సేతుపతి టెన్షన్‌ పట్టుకున్నట్లు సమాచారం. 2021లో మాస్టర్, ఉప్పెన సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ‘తమిళ్ తలైవా’ మరిన్ని విభిన్న స్టోరీలతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ సమ్మర్‌లోనే దాదాపు నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఉప్పెన అద్బుతమైన విజయం సాధించడంతో విజయ్ సేతుపతి నటించిన కొన్ని పాత తమిళ్ సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఆ సినిమాలు తెలుగులో ఎంతమేర సక్సెస్ అవుతాయో తెలీదు గానీ, సేతుపతి డేట్స్ ఇస్తే అతనితో నేరుగా సినిమాలు చేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీ‌కాంత్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరాభిమానాలు లభించాయో, ప్రస్తుతం విజయ్‌ సేతుపతికి కూడా అంతే స్థాయిలో అభిమానుల అండదండలు పుష్కలంగా లభించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Next Story