స్టైలిష్ స్టార్‌కు రౌడీ స్టార్ ప్రొడక్ట్స్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌ సహా పలుభాషల్లో తన నటనతో తిరుగులేని అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. విలక్షణమైన నటన, ప్రత్యేకమైన ఆటిట్యూడ్‌‌తో రౌడీ స్టార్‌గా ముద్రవేసుకున్నాడు. అయితే, చాలా మంది హీరో హీరోయిన్లలాగానే.. రౌడీ స్టార్ విజయ్ కూడా ఇటు చిత్రరంగంలో కొనసాగుతూనే.. అటు బిజినెస్ వైపు దృష్టి సారించి ‘రౌడీ’ బ్రాండ్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. రౌడీ ప్రొడక్ట్స్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే, పవన్ కల్యాణ్ తన ఫార్మ్ హౌజ్‌లో పండిన మామిడి పండ్లను ఇండస్ట్రీ ప్రముఖులకు పంపించినట్లే.. ఈ రౌడీ స్టార్ కూడా తన బ్రాండ్ ఉత్పత్తులను సెలెబ్రిటీలకు పంపిస్తుంటాడు. తన రౌడీ ఉత్పత్తులతో ఈసారి స్టైలిష్ స్టార్‌ను ఇంప్రెస్ చేశాడు విజయ్.

విజయ్ ‘రౌడీ’ బ్రాండ్ నుంచి తాజాగా కొత్త కలెక్షన్స్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు రౌడీ బ్రాండ్ టీ షర్ట్.. ట్రాక్, స్పెషల్ మాస్క్‌లను పంపించాడు విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలో.. ‘థ్యాంక్యూ సో మచ్ విజయ్.. సో స్వీట్ ఆఫ్ యూ. లేటెస్ట్ రౌడీ కలెక్షన్స్ నాకు పంపినందుకు చాలా సంతోషం’అంటూ బన్నీ తన ఇన్‌స్టా వేదికగా తెలియజేశాడు. గతంలో కూడా అల్లు అర్జున్‌కు రౌడీ స్టార్ కాంప్లిమెంటరీగా తన కొత్త కలెక్షన్స్‌ను పంపించిన విషయం తెలిసిందే. ఇక విజయ్ సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. కరోనా కారణంగా ప్రస్తుతానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Advertisement